2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ కి గట్టి పోటీ ఇస్తుంది అనుకున్న మహాకూటమి చతికిల పడటం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి తేరుకుంటున్న నేతల్లో కొంతమంది టిడిపితో పొత్తు కారణంగానే ఓడిపోయామని ప్రకటనలు చేయడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో 2019లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకో కూడదు అని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి. వివరాల్లోకి వెళితే..
నల్గొండ జిల్లాలో బాగా పట్టున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను గెలవడం తోపాటు జిల్లాలో పలువురు అభ్యర్థులను గెలిపిస్తారని ఎన్నికల ముందు అందరూ అనుకున్నారు. ఒకానొక సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టి కే పోటీ దారులు గా కనిపించారు. కోమటిరెడ్డి అనుచరులు అయితే తమ నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కూడా ఆశపడ్డారు. తీరా ఫలితాలు వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాక్షాత్తు తాను కూడా ఎన్నికల్లో ఓడిపోయాడు. ఇప్పుడు లోక్ సభ బరిలో నిలబడాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు బెడిసి కొట్టింది కాబట్టి పార్లమెంటు ఎన్నికలలో పొత్తు వద్దంటే వద్దు అంటున్నాడు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, ఎంత తక్కువ అనుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కి 45 సీట్లు వస్తాయని అనుకున్నామని, కానీ మరీ అంత ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం పొత్తు లేనని కోమటిరెడ్డి వ్యాఖ్యానించాడు. పార్లమెంటు ఎన్నికల సందర్భంలో ఇదే పొత్తు కొనసాగిస్తే మళ్లీ పరాభవం తప్పదని, కానీ పొత్తు లేకుండా స్వంతంగా వెళితే మాత్రం కనీసం ఏడు ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవచ్చని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డాడు.
ఏది ఏమైనా కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే పిసిసి చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి మాత్రం తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం జరగలేదని వ్యాఖ్యానించిన దరిమిలా, లోక్ సభ ఎన్నికల్లో సైతం ఇదే పొత్తు కొనసాగించడానికి ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్-టీడీపీ పొత్తు తెలంగాణలో కొనసాగుతుందా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని నెలలు వేచి చూడాల్సిందే.