రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు పాదయాత్రలు చేస్తున్నారని .. కాంగ్రెస్ గెలిస్తే వారినే సీఎం అభ్యర్థులుగా చూస్తారని అనుకున్నారేమో కానీ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాదయాత్ర రేసులోకి వచ్చారు. తాను కూడా పాద యాత్ర చేస్తానని.. తనకు సీఎం పదవి అవసరం లేదంటునే , ఆ పదవే తనను వెతుక్కుంటూ వస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ ను అమలు చేస్తామని ప్రకటించారు.
జూన్ లో ప్రియాంక గాంధీ నల్గొండకు వస్తారని చెప్పారు. తన బర్త్ డే వేడుకలు బల ప్రదర్శనకు వేదిక కాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుండి పోటీ చేయనున్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. గత ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో ఉంటారా లేదా అన్నదానికి చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత మాత్రం ఆయన వాయిస్ మారిపోయింది. పార్టీ వీడిపోయిన ఆయన సోదరుడు మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. అసలు సీనియర్లందరూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రకు సంఘిభావంగా హాత్ సే హాత్ జోడో యాత్రలు చేయాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. కానీ కోమటిరెడ్డి లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు తాను కూడా చేస్తానంటున్నారు. మరి హైకమాండ్ అంగీకరిస్తుందో లేదో మరి !