కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే పనిగా శీలపరీక్ష ఎదుర్కొంటున్నారు. ఇటీవల సోదరులిద్దరూ బీజేపీతో కాస్త చనువుగా వ్యవహరించడంతో ఆ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. కానీ ఢిల్లీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ అంశంపై మరోసార క్లారిటీ ఇచ్చారు. తుదిశ్వాస విడిచే వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఆయన మరో ఎంపీ, టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.
ఒకే ఇంట్లోనే ఎన్నో గొడవలు ఉంటాయని.. అలాంటిది కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉండటం సహజమన్నారు. బీజేపీ,టీఆర్ఎస్లలో కాంగ్రెస్ కన్నా ఎక్కువ గొడవలున్నాయన్నారు. కోమటిరెడ్డికి మోదీ అపాయింట్మెంట్ ఇప్పించడంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలకంగా పని చేశారని.. త్వరలో ఆయనను కమలం గూటికి చేరుస్తారన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో కోమటిరెడ్డి సోదరుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో తాను ఉండబోవడం లేదని ప్రకటించారు.
గతంలో పలుమార్లు బీజేపీని పొగిడిన రాజగోపాల్ రెడ్డి తాను ఆ పార్టీలో చేరుతానని ప్రకటించారు కూడా. తన తమ్ముడికి వ్యక్తిగత అభిప్రాయం అని.. తాను మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని వెంకటరెడ్డి ప్రకటించారు. అందుకే రాజకీయ నేతలు… ఎంత జాగ్రత్తగా ఉంటే అంగా ఇలాంటి ప్రచారాలు నిలుపుకోవచ్చు. లేకపోతే ఎవరూ నమ్మని పరిస్థితి. రాజకీయాలు అలా అయిపోయాయి మరి.