మునుగోడు ఉపఎన్నికల్లో ప్రచారానికి తాను సిద్ధమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ప్రియాంకా గాంధీతో భేటీ తరవాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీ పడినట్లుగా కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయనతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. పార్టీ విజయం కోసం ప్రయత్నిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.సోనియా, ప్రియాంకా గాందీల నిర్ణయం మేరకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక జరుగుతుందని కోమటిరెడ్డి చెబుతున్నారు.
మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న సోదరుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఆ స్థానానికి ఉపఎన్నిక వస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినప్పటి నుండి వెంకటరెడ్డి వ్యవహారశైలి కూడా మారిపోయింది. ఆయన పార్టీని వీడిన సోదరుడ్ని ఒక్క మాట కూడా అనడం లేదు కానీ.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమను కించ పరుస్తున్నారని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అమిత్ షాను కలిసిన రోజునే వెంకటరెడ్డి కూడా కలిశారు. దీంతో ఆయన ఎలాగోలా కాంగ్రెస్ పార్టీ నుంచి గెంటివేయించుకుంటే బీజేపీలో చేరవచ్చని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే ఆయన సొంత పార్టీనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్‌కు తాడేపేడో ఎన్నిక. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తాడన్న ప్రచారం జరగగానే అన్న వెంకటరెడ్డి అభ్యర్థి అయితే ఎలా ఉంటుందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపించింది. ఇప్పుడు కూడా వెంకటరెడ్డి అయితేనే బలమైన అభ్యర్థి అవుతారని కొంత మంది హైకమాండ్‌కు సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు నిజంగానే హైకమాండ్ ఆయనను పోటీ చేయమంటే చేస్తారో లేదోనని కాంగ్రెస్ వర్గాలు సందేహిస్తున్నాయి. ఇప్పటికైతే కోమటిరెడ్డి కాకుండా నలుగురి పేర్లను ఫైనలైజ్ చేశారు. పాల్వాయి స్రవంతి పేరు ఎక్కువగా వినిపిస్తోంది.