తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అసంతృప్త సీనియర్లు కూడా ఆయనకు వ్యతిరేకంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ తో కలవాల్సిన పరిస్థితి రాదని.. కోమటిరెడ్డివి వ్యక్తిగత వ్యాఖ్యలన్న వాదన వినిపిస్తున్నారు. శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి నేరుగానే తమ అభిప్రాయం చెప్పారు. ఇతర నేతలు గుంభనంగా ఉంటున్నారు. అయితే ఈ సారి కోమటిరెడ్డి వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్‌గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే… కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలించారు. వీడియో చూసి ఆయన ఓ అభిప్రాయానికి వచ్చారు. బుధవారం ఉదయం తనను కలవాలని కోమటిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన వస్తారోలేదో కానీ.. ఈ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్‌కు కూడా చాలా ఫిర్యాదులు వెళ్లాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తి స్థాయిలో కోవర్టుగా పని చేస్తున్నారని ఆయనను నమ్మడం వల్ల పార్టీ మునగడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు.
కోమటిరెడ్డి సోదరుడు ఇప్పటికే బీజేపీలో ఉన్నారు. తరచూ బీజేపీ అగ్రనేతల్ని కోమటిరెడ్డి కలుస్తున్నారు. వివాదాస్పద కామెంట్లు చేస్తున్నారు. సొంత పార్టీపైనా ఆయన చేస్తున్న కామెంట్లు వివాదాస్పదం అవుతున్నాయి. ఇదంతా కావాలనే చేస్తున్నారని.. పార్టీలో ఉంటూ.. పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని ఇతర కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ధాక్రే.. తాను ఇంచార్జ్ గా వచ్చిన తర్వాత సీనియర్లను ఎలా గౌరవించాలో అలా గౌరవించారని.. ఇక తన మాటను జవదాటినందున సీరియస్ యాక్షన్ తీసుకుంటారని అంటున్నారు.