తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ అన్నట్టుగా మారుతోంది జంప్ జిలానీల తలనొప్పి! సొంత పార్టీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆత్రం సుక్కు, రేగా కాంతారావులు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీళ్ల దారిలోనే మరో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా తెరాసలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా ఆయన భేటీ అయ్యారు. మరో రెండ్రోజుల్లో అధికారికంగా తెరాసలో చేరబోతున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే లింగయ్యను తెరాసలో చేర్చేందుకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి మంతనాలు జరిపినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీకి దూరమౌతున్న ఈ ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదా, అంటే లేదనే చెప్పాలి. తెరాస నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే లింగయ్య ఎవ్వరికీ అందుబాటులో లేరట!
కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి సోదరులకు ఈ లింగయ్య అత్యంత సన్నిహితుడు! కోమటిరెడ్డి వర్గంలో ఈయన కీలకంగా ఉంటూ వస్తున్నారు. నిజానికి, గత ఎన్నికల్లో లింగయ్యకు టిక్కెట్ ఇప్పించేందుకు కోమటిరెడ్డి సోదరులే తీవ్ర ప్రయత్నం చేశారు. పార్టీ నుంచి టిక్కెట్ రాదనే అసంతృప్తిలో ఉన్న సమయంలో భరోసా ఇచ్చి, పార్టీ నాయకత్వంతో మాట్లాడింది కూడా కోమటిరెడ్డి సోదరులే. ఇప్పుడు లింగయ్య పార్టీకి దూరమౌతుండటం కోమటిరెడ్డి వర్గానికి కూడా కొంత నష్టమే అంటున్నారు స్థానికులు.
లింగయ్య అంత కీలకం అయినప్పుడు ఆయన పార్టీ మారుతుంటే కోమటిరెడ్డి సోదరులు ఏం చేస్తున్నట్టు? ఆయన పార్టీ మారబోతున్నట్టు ముందుగా గుర్తించలేకపోయారా? అంత ఆప్తుడైనప్పుడు లింగయ్యతో కోమటిరెడ్డి సోదరులు మాట్లాడలేరా? పార్టీని విడిచిపెట్టొద్దంటూ భరోసా కల్పించలేరా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. వాస్తవానికి, పార్టీ రాష్ట్ర నాయకత్వంపై కోమటిరెడ్డి సోదరులు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. నాలుగురోజులు కిందట జరిగి సీఎల్పీ భేటీ సందర్భంగా రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలంటూ రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పీసీసీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీతో పొత్తు వద్దని తాను మొదట్నుంచీ చెప్తున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడం వల్లనే ఓడిపోయామంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చాలా సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. ఓవరాల్ గా రాష్ట్ర నాయకత్వంపై కోమటిరెడ్డి సోదరులు సంతృప్తిగా లేరు. ఇలాంటి సమయంలో వారి మద్దతుదారుడు పార్టీ నుంచి వెళ్లిపోతుండటం కొంత చర్చనీయం అవుతోంది.