రైతుల సమస్యలపై పోరాటం చేసేందుకు పాదయాత్రకు బయలుదేరుతున్నారు భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈనెల 26 నుంచి మూడు రోజులపాటు యాత్ర చేయనున్నారు. బ్రహ్మణవెల్లంల నుంచి హైదరాబాద్ లోని జలసౌధ వరకూ ఈ యాత్ర నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. అంతేకాదు, ఈ యాత్రకు భారీ సంఖ్యలో రైతుల్ని తనతోపాటు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు. దాదాపు 5 వేల మందిని యాత్రలో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. ఈ యాత్రలో ప్రధాన డిమాండ్ ఏంటంటే బ్రహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలనీ, కావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరనున్నారు. 2007లోనే దీనికి అప్పటి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందనీ, దాదాపు 7 వందల కోట్లతో దీన్ని పూర్తి చెయ్యొచ్చన్నారు. కేసీఆర్ సర్కారు దీన్ని పూర్తిగా పట్టించుకోవడం లేదనీ, తనపై రాజకీయ కక్ష పెట్టుకుని ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతోందనీ, ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, అన్నదాత కన్నీరు పెడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు కోమటిరెడ్డి.
పాదయాత్ర షెడ్యూల్ అయితే ప్రకటించేశారుగానీ.. దీనికి అనుమతులు వస్తాయా లేదా అనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే, హైదరాబాద్ లో దాదాపు 30 కి.మీ. పొడవున యాత్ర సాగేలా కోమటిరెడ్డి ప్లాన్ చేసుకున్నారు. ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా దీనికి అనుమతి వచ్చే అవకాశం కష్టంగానే కనిపిస్తోంది. ఐదు వేల మందితో నగరంలో జలసౌధ వరకూ యాత్ర అంటే… భద్రతాపరమైన కారణాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.
యాత్రకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరాననీ, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే హైకోర్టుకు వెళ్లైనా అనుమతులు తెచ్చుకుంటానని కోమటిరెడ్డి చెబుతున్నారు. తన యాత్రను అడ్డుకునే ప్రయత్నం తెరాస సర్కారు చేసే అవకాశముందనీ అన్నారు. కోమటిరెడ్డి యాత్రకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది వస్తారూ అనేదీ చర్చనీయమే. ఎందుకంటే, కాంగ్రెస్ లో కావాల్సినన్ని గ్రూపులున్నాయి. ఆధిపత్య పోరు కొనసాగుతున్న పరిస్థితి! ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి యాత్రపై సొంత పార్టీ వర్గాల నుంచి లభించే సహకారం ఏమాత్రమో చూడాలి. మొత్తానికి, కోమటిరెడ్డి తలపెట్టిన యాత్ర రాజకీయంగా కొంత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.