తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరులపై ఈ మధ్య తరచూ ఏదో ఒక కథనం ప్రచారంలో ఉంటూనే ఉంది. పీసీసీ అధ్యక్ష పీఠం కోసం వీరు చేస్తున్న ప్రయత్నాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధ్యక్ష పీఠం తనకు ఇస్తే, రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి మరీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని కోమటిరెడ్డి చాలాసార్లు చెప్పారు. అయితే, పార్టీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఈ బ్రదర్స్ రాజకీయ భవిష్యత్తు ఏంటనే చర్చ జరుగుతోంది. బయటకి చెప్పలేకపోతున్నారుగానీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తరువాత వీరిలో కొంత అభద్రతా భావం పెరిగిందనే అనాలి. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ తరఫున తామే కీలక పాత్ర పోషించబోతున్నాం అని నిన్నమొన్నటి వరకూ అనుకున్నారు. కానీ, ఢిల్లీ స్థాయిలో వీరికి అండగా నిలుస్తూ వచ్చిన దిగ్విజయ్ సింగ్ ను రాష్ట్ర వ్యవహారాల బాధ్యతల నుంచి తప్పించడం, రేవంత్ రెడ్డి చేరికతో ఈ సోదరుల కాస్త ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి.
వీరి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఓ ఆసక్తికరమైన చర్చ తాజాగా జరుగుతోంది. కోమటిరెడ్డి సోదరులు ఈ మధ్య కొంతమంది సీనియర్ నేతల్ని కలుస్తున్నారట. తమ అనుచర నేతలతో కూడా తరచూ సమావేశమౌతూ, రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలే చర్చిస్తున్నట్టు సమాచారం. మరో రెండు లేదా మూడు నెలలపాటు వేచి చూద్దామనీ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తమ పాత్ర ఏంటనే స్పష్టత ఈలోగా వస్తుందని అంటున్నారట. ఒకవేళ తాము ఆశించిన ప్రాధాన్యత హైకమాండ్ ఇవ్వకపోతే… రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుందాం అంటూ అనుచరులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ కీలక నిర్ణయం ఏంటనే దానిపై రెండు అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మొదటిది.. పార్టీ మార్పు! వారు ఆశించినట్టు పరిణామాలు ఉంటే ఓకే, లేదంటే కోమటిరెడ్డి సోదరులు తెరాసలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కొందరు అంటున్నారు. తెరాస వారిని చేర్చుకుంటుందా అనేది వేరే చర్చ. ఇక, రెండొది.. సొంత పార్టీ ఆలోచన కూడా వారికి ఉందని వినిపిస్తోంది! రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సొంత పార్టీ పెడితే ఎలా ఉంటుందనే అంశం కోమటిరెడ్డి అనుచర వర్గం ప్రతిపాదనగా ప్రచారంలోకి వచ్చింది.
అయితే, ఇక్కడ ఇంకో కోణం కూడా చూడాలి. ఇలాంటి చర్చను ఉద్దేశపూర్వకంగా కోమటిరెడ్డి సోదరులే తెరమీదికి తెస్తున్నారనీ అనుకోవచ్చు. పార్టీ హైకమాండ్ కు తమ అసంతృప్తి అర్థం కావాలనీ, లేదంటే తాము పార్టీకి దూరమయ్యే పరిస్థితి కూడా ఉంటుందనే సంకేతాలు ఇవ్వాలనే వ్యూహమూ కావొచ్చు. పార్టీ మార్పుగానీ, కొత్త పార్టీ ఏర్పాటు ఆలోచనగానీ.. ఈ కథనాలు పార్టీ పెద్దలకు చేరాలనేదే వారి ఆలోచనై ఉండొచ్చు. గుజరాత్ ఎన్నికల హడావుడి ముగిస్తే రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తారని అంటున్నారు. ఆయన వచ్చిన తరువాత ఈ సోదరుల రాజకీయం ఏంటనేది కచ్చితంగా కొంత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే, ఈలోగా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పాత్ర ఏంటనేది కూడా తేలిపోతుంది కదా!