తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి ఎంపీ కోమటిరెడ్డి తన పరిధిలో చేతనైనంత వరకూ ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దండోరా సభ నిర్వహించి.. కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నింపిన రేవంత్ రెడ్డి తర్వాతి సభ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పెట్టాలని నిర్ణయించారు. పద్దెనిమిదో తేదీని ముహుర్తంగా ఖరారు చేశారు. అయితే ఇక్కడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆయన భువనగిరి ఎంపీగా ఉన్నారు. తన నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఇబ్రహీంపట్నంలో దళిత, గిరిజన దండోరా సభ ను ఖరారు చేసే ముందు తనకు సమాచారం ఇవ్వలేదని ఆయన గుస్సా అయ్యారు. అంతే కాదు… పద్దెనిమిదో తేదీన తాను అందుబాటులో ఉండనని ఇరవయ్యో తేదీ తర్వాత ఏర్పాటు చేస్తే వస్తానని చెప్పారు. దీనిపై పెద్ద రచ్చ జరగడంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వరకూ వెళ్లింది.
చివరికి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కోమటిరెడ్డికి ఫోన్ చేసి చీవాట్లు పెట్టినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ కోమటిరెడ్డి తగ్గలేదని అంటున్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్లుగా ఆయన రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ మాటల్లో అంతరార్థం తెలుసుకున్న రేవంత్ రెడ్డి.. భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాకుండా… మరో నియోజకవర్గం పరిధిలో దళిత , గిరిజన దండోరా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేసమయంలో పోలీసులు కూడా అనుమతి నిరాకరించడంతో .. గతంలో తాను పాదయాత్ర చేసి ముగింపు సభ నిర్వహించిన ప్రైవేటు స్థలం ఉన్న రావిర్యాలలో దళిత, గిరిజన దండోరా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా రేవంత్ రెడ్డి ఇబ్రహీంపట్నలో సభను నిర్వహించి ఉండేవారే. కోర్టుకు వెళ్లో.. మరో రకంగానో తన ప్రయత్నాలు చేసేవారు.
అయితే అంత చేసి స్థానిక ఎంపీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాకపోతే సమస్యలు వస్తాయని.. పార్టీలో రచ్చ జరగడం ఇష్టం లేకనే రేవంత్ రెడ్డి సభా వేదికను మార్చారని అంటున్నారు. రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.. వారిలో కొంత మంది కలసిరాకపోయినా వ్యతిరేకంగా పోవడం లేదు.. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం రేవంత్‌తో కలవడం లేదు సరి కదా ఆయనను ఎక్కడికక్కడ వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రేవంత్‌కు చిక్కులు తప్పడం లేదు.