పీసీసీ చీఫ్ పదవి ఆశించి దక్కకపోయే సరికి కాంగ్రెస్ పార్టీపైనే తీవ్ర ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో అయినా ఆ స్థాయి పదవి దక్కుతుందేమోనని మెల్లగా ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది.గతంలోఆయన గడ్కరీతో తరచూభేటీ అయ్యారు. ఇప్పుడు.. ఢిల్లీ వెళ్లి కిషన్ రెడ్డితో పాటు ఇతర కేంద్రమంత్రులతోనూ సమావేశమయ్యి… వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారు. పార్టీ మారే ఉద్దేశం లేదంటూనే.. రేవంత్ రెడ్డి చిన్న పిల్లవాడని..ఆయన గురించి తనతో మాట్లాడవద్దని తేల్చేశారు. అభివృద్ధి పనుల కోసమే కేంద్రమంత్రుల్ని కలుస్తున్నానని చెప్పుకొస్తున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో ఇక ఉండటం అనవసరం అనుకుంటున్న కోమటిరెడ్డి.. ఇప్పటికిప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వస్తే.. ఇతర పార్టీలో సరైన ప్రాధాన్యం లభిస్తుందో లేదో అన్న సందేహంలో ఉన్నారు. అందుకే బీజేపీ వైపు నుంచి ఏమైనా ఆఫర్ వస్తుందా అన్న దిశగా చూస్తున్నారు. వారెవరూ స్పందించకపోతూండటంతో తానే వెళ్లి కలుస్తున్నారు. కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ పొందిన కిషన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. తన నియోజకవర్గంలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధికి నిధులివ్వాలని అధికారికంగా విజ్ఞప్తి చేశారు. అనధికారికంగా రాజకీయ చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఆ చర్చల సారాంశం ఏమిటన్నదానిపై స్పష్టతలేదు. కానీ కోమటిరెడ్డి మాత్రం.. తాను బీజేపీలోకి వస్తే అంతకు మించిన పదవి కోరుకుంటున్నారు.
తన స్టామినా గుర్తించి.. తెలంగణ బీజేపీ అధ్యక్ష పదవి లాంటి దాన్ని ఆఫర్ చేస్తే చేరాలని అనుకుంటున్నారు. అలాంటి హామీతో చేర్చుకుంటారేమోనని ఆయన కూడా బీజేపీ నేతల చుట్టూతిరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. కానీ అలాంటి చాన్స్ ప్రస్తుతానికి లేదని బీజేపీలో ఉన్న పరిస్థితుల్ని చూస్తే అర్థమైపోతుంది. అయినా కాంగ్రెస్లో.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి కోమటిరెడ్డి ఏ మాత్రం సిద్ధంగా లేరు కాబట్టి… తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారని అంటున్నారు.