హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ స్థానానికి తమ పార్టీకి తెలుగుదేశం మద్దతిస్తుందని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చెప్పారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన తరపున నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ ఈ ఎన్నికల్లో నల్గొండతో సహా 4 లేదా 5 సీట్లు గెలుచుకుంటామని అన్నారు. ఈ ఎన్నికలు 2019 అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ అని చెప్పారు. వామపక్షాలు తమకు మద్దతిచ్చాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. అదిలాబాద్ అభ్యర్థిగా మహేశ్వరరెడ్డి, నిజామాబాద్ అభ్యర్థిగా వెంకటరమణారెడ్డిని, రంగారెడ్డి అభ్యర్థిగా చంద్రశేఖర్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది.