తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారయిందని ప్రచారం ప్రారంభం కాగానే ఆశావహులు తెరపైకి వస్తున్నారు. ఉండబట్టలేని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు మాత్రం అప్పుడే శాఖలు కూడా ఎంచుకుని మీడియాతో చిట్ చాట్లు చేస్తున్నారు. కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు హోం శాఖ అంటే చాలా ఇష్టమని ముందుగానే మీడియా ద్వారా కాంగ్రెస్ హైకమాండడ్ కు సంకేతాలు పంపారు. అయితే ఏ పదవి వచ్చినా సమర్దవంతంగా నిర్వహిస్తా.. ప్రజల పక్షాన నిలబడతానన్నారు. ఢిల్లీలో సీరియస్ గానే కేబినెట్ పై చర్చ జరిగినట్లు ఉందని.. అయితే ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి అయితే ఫోన్ రాలేదని చెబుతున్నారు.
ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్లో నాలుగు భర్తీ చేయాలని అనుకుంటున్నారు ఈ నాలుగు ఎవరెవరికి అన్నదానిపై హైకమాండ్ స్పష్టత ఇచ్చిందని అంటున్నారు. ఇందులో కోమటిరెడ్డి పేరు ఉండే చాన్స్ లేదని ఎక్కువ మంది అభిప్రాయం. ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. ప్రాతినిధ్యం లేని జిల్లాలు చాలా ఉన్నాయి. అదే సమయంలో రెడ్డి సామాజికవర్గానికి మరో మంత్రి పదవి దక్కడం కష్టమే. కులగణన చేసి బీసీ ఆకర్ష్ రాజకీయాలు చేస్తున్నందున బీసీలకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.
అయితే పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారిలో రెడ్డి ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు. వారికి ఏ పదవులు లభించకపోతే ఎలా స్పందిస్తారో అన్నది కాంగ్రెస్ హైకమాండ్ లో ఇప్పటికీ ఆందోళనగా ఉంది. రాజగోపాల్ రెడ్డి అయితే ఆయనకు పార్టీ.. గట్రా ఏమి ఉండవు. రెండు సార్లు పార్టీ నుంచి పోయి.. గెలిచే మూడ్ కనిపించిన తర్వాతే తిరిగి వచ్చారు. పదవి ఇవ్వకపోతే గతంలోలా ఆయన రేవంత్ ను టార్గెట్ చేసుకున్నా ఆశ్చర్యం ఉండదు.