కొంత గ్యాప్ తరువాత, ఇప్పుడు ఇలా వాడీవేడీ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాష్ట్ర నాయకత్వంపై ఆయన మొదట్నుంచీ అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓసారి… తరువాత కూడా ఓసారి రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన గతం ఉంది. ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతారా, పార్టీ మారబోతున్నరా అనే చర్చా కొన్నాళ్లు నడిచింది. అయితే, కొంత విరామం తరువాత ఇప్పుడు మరోసారి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు రాజగోపాల్. లోపం ఇక్కడే ఉందని గతంలో తాను చెప్పాననీ, అవి ఆవేదనతో చేసిన వ్యాఖ్యలే తప్ప పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి చేసినవి కాదన్నారు. ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నాననీ… సరైన సమయంలో సరైన నాయకత్వం అందించలేకపోవడం వల్లనే తెలంగాణలో పార్టీకి నష్టం జరిగిందన్నారు. రెండుసార్లు తప్పులు జరిగాయనీ, ఇప్పుడైనా సరే అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుని, సరైన నాయకత్వాన్ని అందిస్తే మంచిదన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ని గద్దె దింపాలన్నది ఒక్కటే లక్ష్యమని రాజగోపాల్ అన్నారు. ఈ దిశగా కాంగ్రెస్ సరైన నిర్ణయాలు తీసుకుంటే కలిసి ముందుకు సాగుతాననీ, లేని పక్షంలో అవసరమైతే బీజేపీ కలిసి పోరడతా అని చెప్పారు. లేదంటే సొంత పార్టీ పెట్టే ఆలోచన చేస్తాననీ… ఏ నిర్ణయానికైనా రెడీగా ఉన్నా అన్నారు రాజగోపాల్. కేసీఆర్ దోపిడీ ఆపాలంటే ఏదో ఒకటి చెయ్యక తప్పదన్నారు. సరైన సమయం వస్తుందనీ, అప్పుడు అన్ని విషయాలూ బయటపెడతానని రాజగోపాల్ అన్నారు.
ఇప్పుడీ అంశం రాజగోపాల్ రెడ్డి ఎందుకు మరోసారి తెరమీదికి తెచ్చారంటే… పీసీసీ కొత్త అధ్యక్షుడు ఎవరు అనే చర్చ జరుగుతోంది కదా. పీసీసీ నియామకంలో పొరపాట్ల వల్లనే రాష్ట్రంలో పార్టీ నష్టపోతోందన్నది ఆయన అభిప్రాయం. తనకు ఇష్టం లేని నాయకుడికి పీసీసీ పగ్గాలు ఇస్తే పార్టీలో కొనసాగే పరిస్థితి ఉండదని ఓపెన్ గా చెప్తున్నారు. హైకమాండ్ కి ముందస్తుగానే ఓ హెచ్చరిక చేశారని అనుకోవచ్చు! రాజగోపాల్ వ్యాఖ్యలను హైకమాండ్ ఎలా తీసుకున్నా, రాష్ట్ర కాంగ్రెస్ లో మరోసారి ఈ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరిగే అవకాశమే కనిపిస్తోంది.