కోమటిరెడ్డి వెంకట రెడ్డి బీజేపీని రెచ్చగొడుతున్నారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి వస్తారన్నట్లుగా ఆయన స్సేస్ లేకపోయినా సృష్టించుకుని మరీ హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ ఆ విమర్శలపై శరవేగంగా స్పందించిది. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కోమటిరెడ్డికి సవాల్ చేశారు. ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకున్నా సరే.. నలభై ఎనిమిది గంటల్లో ప్రభుత్వం ఉండదని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా అంతా తమ దగ్గర ఉందన్నారు. ఈటల రాజేందర్ తో పాటు ఇతర నేతలు కూడా ఇలాగే స్పందించారు.
బీజేపీ నుంచి వచ్చిన జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకు అభ్యర్థిత్వం కాకపోయినా ఓ పదవి ఇచ్చారు. ఆ సమయంలో బీజేపీ వైపు నుంచి పెద్దగా విమర్శలు రాలేదు. ఆ ఒక్కటి తప్ప బీజేపీ నేతల జోలికి వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నించలేదు. బీజేపీ కూడా రేవంత్ విషయంలో ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆసక్తితో లేదు. కానీ కోమటిరెడ్డి అనూహ్యంగాఈ చేరికలు.. ఫిరాయింపుల రేుసలోకి బీజేపీని తీసుకు వచ్చారు. రేవంత్ రెడ్డి బీజేపీ నుంచి వచ్చే ఒక్క ఎమ్మెల్యేనూ చేర్చుకునే ఉద్దేశం లేదని చెబుతున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటారని చెబుతున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలపై మాత్రం ఎలాంటి చర్చ జరగడం లేదు. కొద్ది రోజుల కిందట సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు రేవంత్ రె్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నేత కోనేరు కోనప్ప కాంగ్రెస్లో చేరడంతో పాల్వాయి హరీష్ బాబు పార్టీ మారే అవకాశం లేదని తేలిపోయింది. అయినా కోమటిరెడ్డి బీజేపీని ఎందుకు టార్గెట్ చేశారోనన్న చర్చ కాంగ్రెస్లో జరుగుతోంది.