కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు, అనంతరం పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు ఇవ్వడం.. ఇదంతా తెలిసిందే. అయితే, తాజాగా రెండోసారి కూడా రాజగోపాల్ రెడ్డికి షో కాజ్ నోటీసులు జారీ చేసింది టి. కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం. నిజానికి, రెండ్రోజుల కిందట జారీ చేసిన తొలి నోటీసులపై రాజగోపాల్ వివరణ ఇచ్చారు. అయితే, దానిపై రాష్ట్ర నాయకత్వం సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ఆయన పంపిన వివరణపై దాదాపు మూడు గంటలపాటు సోమవారం నాడు పార్టీ నేతలు చర్చించారు. తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావనీ, ఆ కార్యక్రమంలో కొంతమంది కార్యకర్తలకు సంబంధించిన అంశాలను మాత్రమే ప్రస్థావించాననీ, రాష్ట్ర వ్యవహారాల కుంతియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా తన వ్యక్తిగత అభిప్రాయాలు కావనే విధంగా వివరణ ఇచ్చారు రాజగోపాల్. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నవారిలో తానూ ఒకడినని అన్నారు!
అయితే, నోటీసులు ఇచ్చిన క్రమశిక్షణా సంఘం సభ్యులపై కూడా రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు కదా! గాంధీభవన్ లో ఉంటున్న కొంతమంది బ్రోకర్లు తనకు నోటీసులు ఇచ్చారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని క్రమశిక్షణా సంఘం తప్పుబడుతోంది. రెండో షో కాజ్ నోటీసులో ఆ పదజాలానికి వివరణ కోరారు. 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలంటూ తాజా నోటీసులో పేర్కొన్నారు. ‘కుంతియా పార్టీకి పట్టిన శని’ అని వ్యాఖ్యానించిన ఆయన… తరువాత కుంతియాతో కూడా మాట్లాడినట్టు సమాచారం! ఆయనకు వివరణ ఇచ్చుకున్నారో ఏమో తెలీదుగానీ… ఆ వ్యాఖ్యల్ని కుంతియా కూడా కొంత లైట్ గానే తీసుకున్నట్టు తెలుస్తోంది.
దీనికి కారణం లేకపోలేదు..! అసెంబ్లీ ఎన్నికలకు సమయం బాగా దగ్గరపడుతోంది. ఇలాంటి సందర్బంలో పంతాలకుపోయి, క్రమశిక్షణలో భాగంగా అంటూ సీనియర్ నేతలపై చర్యలకు దిగితే… అదో కొత్త పంచాయితీగా తయారై కూర్చుంటుంది. కాబట్టి, ఈ అంశానికి అంత ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశం హై కమాండ్ కి లేనట్టుగానే కనిపిస్తోంది. వాస్తవానికి, కుంతియాతోపాటు, ఏఐసీసీలో పలువురు ప్రముఖులతో రాజగోపాల్ రెడ్డికి మంచి సాన్నిహిత్యమే ఉంది. ఈ నేపథ్యంలో ఆయనపై తీవ్రమైన చర్యలంటూ ఏవీ ఉండే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. కానీ, రాష్ట్ర స్థాయిలో కొంతమంది నేతలు రాజగోపాల్ రెడ్డిపై గట్టిగానే చర్యలుండాలని పట్టుబడుతున్నారు. అందుకే, వరుసగా రెండో షో కాజ్ నోటీస్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డికి ఢిల్లీ నుంచే ఉపశమనం లభించే వాతావరణం కనిపిస్తుంటే.. ఇక రాష్ట్ర స్థాయి నేతల పంతాలూ పట్టింపులూ నోటీసులు దాటి ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందా..?