“సీఎం రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి 15 నెలలు ప్రశాంతంగా పడుకున్నారు. నిన్నటి దాకా ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క ఉంటుంది గుర్తుపెట్టుకోండి ” అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ సభ్యులకు బీభత్సమైన వార్నింగ్ ఇచ్చారు. ఈ డైలాగ్ లో ఓ లింక్ మిస్సయింది. అదేమిటంటే రేపోమాపో తాను హోంమినిస్ట్ర ను కాబోతున్నానని అందుకే లెక్క మారబోతోందని ఆయన చెప్పాలనుకున్నారు. కానీ ఇంకా అధికారికంగా అనౌన్స్ మెంట్ రాలేదు కాబట్టి డైలాగ్ ను పరిమితం చేసుకున్నారు.
ఇప్పటికే తనకు మంత్రి పదవి వచ్చేస్తుందని ఫిక్స్ అయిపోయిన ఆయన తనకు హోంశాఖ అంటే ఇష్టమని కూడా సంకేతాలు పంపారు. ఇదే అంశాన్ని బుధవారం నెగెటివ్ కోణంలో కూడా మరోసారి గుర్తు చేశారు. తాను హోంమంత్రి ఫోర్ట్ ఫోలియా కోరలేదని.. దానికి తాను సమర్థుడినని మాత్రం చెప్పుకున్నానన్నారు. అయితే తనను హోంమంత్రిగా చూడాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఆయన తన కోరికను కాంగ్రెస్ కార్యకర్తల కోరికగా మార్చుకున్నారు.
మొత్తంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేల మీద ఉండటం లేదు. ఆయన పదవుల కోసం అన్నట్లుగా మూడు సార్లు కాంగ్రెస్ నుంచి పోయి.. మూడు సార్లు తిరిగి వచ్చారు. కాంగ్రెస్ లో ఉండి ఎప్పుడూ కాంగ్రెస్ కోసం పని చేయలేదు. గెలుస్తుందని అనుకున్న తర్వాతనే మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ ఊపిరి తీయడానికి మునుగోడు ఉపఎన్నిక కూడా తెచ్చారు. అయినా ఇప్పుడు ఆయన చాలా కాన్ఫిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ తనకు మంత్రి పదవి బాకీ ఉందని అనుకుంటున్నారు.