కేంద్రహోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించారు..! కొంతమంది నాయకులు ఆయన చేతులు మీదుగా కాషాయధారణ చేయించుకున్నారు! ఈ క్రమంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం కనిపించకపోవడం కొంత చర్చనీయం అవుతోంది. చేరబోయే పార్టీ జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్ కి వస్తే… రాజగోపాల్ రెడ్డి ఏమైనట్టు, వెళ్లి పలకరించి, కండువా కప్పి మర్యాద చెయ్యాలి కదా! గడచిన రెండుమూడు రోజులుగా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నట్టు అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేసి, పార్టీ క్రమశిక్షణ సంఘం నుంచి షోకాజ్ నోటీసు ఎదుర్కొని, భాజపాలో చేరేందుకు ముహూర్తంగా పెట్టేసుకున్నారని కథనాలు వచ్చాయి. కానీ, ఇప్పుడు అమిత్ షా పర్యటన తరువాత… రాజగోపాల్ చప్పుడు చేయడం లేదు!
ఏ కారణం లేకుండా ఇలా కామ్ అయిపోరు కదా! రాజగోపాల్ రెడ్డిపై చర్యలకు ఏఐసీసీ కూడా సిద్ధమైనట్టు కాంగ్రెస్ వర్గాలు గతవారంలో చెప్పాయి. పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలన్నింటిపైనా ప్రత్యేకంగా ఓ నివేదికను రాష్ట్ర నాయకత్వం నుంచి హైకమాండ్ తెప్పించుకుంది. ఆయన భాజపాలో చేరేలోగానే సస్పెన్షన్ వేటు తప్పదనీ, పార్టీ వర్గాలకు ఇదో సందేశం అవుతుందనీ అన్నారు. బహుశా… ఆ వేటు కోసమే రాజగోపాల్ రెడ్డి ఎదురు చూస్తున్నారని అనిపిస్తోంది. పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసేస్తే… ఆ కారణంతో భాజపాలో చేరాలని సమయం కోసం ఎదురుచూస్తున్నట్టున్నారు.
అయితే, ఆయనే రాజీనామా చేసి వెళ్లే ఆప్షన్ కూడా ఉంది! కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజీనామా చేసి, భాజపా టిక్కెట్ పై ఉప ఎన్నికల్లో గెలవడం అనేది అనుకుంత ఈజీ కాదు. ఆ సంగతి ఆయనకి తెలియంది కాదు! పైగా, రాజగోపాల్ రెడ్డి భాజపాలో చేరికపై ఆయన అనుచరగణంలోనే కొంతమందికి నచ్చడం లేదని సమాచారం. వారిని ఆయన బుజ్జగిస్తున్నారట. ఇంకోపక్క… భాజపా తరఫున తానే సీఎం అని రాజగోపాల్ గొప్పలు చెప్పుకున్నారు. ఆ వ్యాఖ్యలతో రాష్ట్ర భాజపా నాయకత్వం కూడా కోమటిరెడ్డిపై కాస్త గుర్రుగా ఉంది. ఇవన్నీ మెల్లగా సెట్ చేసుకుని… కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవిని వదులుకోకుండా భాజపాలో చేరాలని వేచి చూస్తున్నారు! అందుకే, అమిత్ షా వచ్చినా రాజగోపాల్ స్పందించలేదు.