కాంగ్రెస్‌లో ఉండాలో.. బీజేపీలోకి పోవాలో తెలియక.. సతమతమవుతున్న రాజగోపాల్ రెడ్డి.. తన అన్న కోమటిరెడ్డిని కూడా ఇరకాటంలోకి పెడుతున్నారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను ధిక్కరించడం వెనుక.. ఆయన అన్న వెంకటరెడ్డి హస్తం ఉందనే నమ్మకం కాంగ్రెస్ పార్టీలో ఉంది. నిజంగా ఉందో లేదో కానీ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం.. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని నిస్సంకోచంగా చెబుతున్నారు. మరో జన్మంటూ ఉంటే కాంగ్రెస్‌లోనే ఉంటానని కూడా చెబుతున్నారు. రాజకీయ నాయకులు ఇంతే చెబుతారు కానీ.. సమయం వచ్చినప్పుడు పార్టీ మారిపోతారు. అయితే.. ఇప్పుడు.. కోమటిరెడ్డి సోదరులు బీజేపీలో చేరితే వారికే… పెద్ద పీట వేసే అవకాశమే కనిపించడం లేదు. అందుకే.. తన సోదరుడు.. తన పేరును బీజేపీకి ముడిపెట్టినప్పుడల్లా.. వెంకటరెడ్డి ఉలిక్కి పడుతున్నారు. ఉన్న పళంగా.. ఖండిస్తున్నారు.
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు సమావేశానికి వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పై కాస్త సానుకూలంగా మాట్లాడారు. బీజేపీ పిలువలేదు.. వెళ్లడం లేదని కవర్ చేసుకున్నారు. మళ్లీ ఒక్క రోజులోనే మాట మార్చారు. బీజేపీలోకి చేరడం ఖాయమని.. శుక్రవారం తేల్చేశారు. అయితే.. ఒక రోజు కాంగ్రెస్.. మరో రోజు బీజేపీ అని చెబుతున్న రాజగోపాల్ రెడ్డి మాటలను ఎవరూ సీరియస్ గా తీసుకోడం లేదు. అందుకేనేమో.. ఈ సారి తన అన్నను కూడా.. ఈ వివాదంలోకి తీసుకొచ్చారు. తానే కాదు.. వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వస్తారని ప్రకటించేశారు. దీంతో.. ఇద్దరూ కూడబలుక్కునే రాజకీయం చేస్తున్నారేమో అన్న చర్చ ప్రారంభమయింది. ఇది కాంగ్రెస్ పార్టీలో .. తన పలుకుబడిగా.. గండి పెట్టేలా ఉండటంతో.. ఉన్న పళంగా వెంకటరెడ్డి ఖండించారు.
బీజేపీలో చేరగానే… తనకు వీరతాళ్లు వేసేస్తారని.. రాజగోపాల్ రెడ్డి భావించారు. అందుకే.. ఆయన తనతో పాటు క్యాడర్ ను తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అందు కోసం వారికి.. బీజేపీ అధికారంలోకి వస్తే తానే సీఎంనని చెప్పుకోవడం ప్రారంభించారు. ఆ ఆడియో టేప్ బయటకు రావడంతో.. మొత్తానికే మోసం వచ్చింది. రాష్ట్ర బీజేపీ నేత.. రాజగోపాల్ రెడ్డి చేరికను అడ్డుకున్నారు. అప్పటికే కాంగ్రెస్ పై తిట్ల వర్షం కురిపించిన రాజగోపాల్ రెడ్డి పరిస్థితి.. ఒక్క సారిగా తిరగబడిపోయింది. ఇప్పుడు సామాన్య కార్యకర్తగా అయినా బీజేపీలోనే చేరుతానని చెప్పుకొస్తున్నారు. అలా అయినా.. రాజగోపాల్ రెడ్డిని బీజేపీలో చేర్చుకుంటారో లేదో కష్టమే..!