ఆ మద్యన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో నీటి ప్రాజెక్టులపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ గురించి చాలా మంది రకరకాలుగా స్పందించారు. అధికారంలో ఉన్న పార్టీ ఏమిచేసినా సహజంగానే దానిని ప్రతిపక్షాలు విమర్శించాలనే ఒక అప్రకటిత నియమాన్ని రాజకీయ పార్టీలున్నీ తూచా తప్పకుండా పాటిస్తుంటాయి కనుక అన్ని పార్టీలు కేసీఆర్ ని విమర్శించాయి. కానీ సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాత్రం దానిని చాలా ప్రశంసించారు. అప్పటి నుంచి ఆయన తెరాసలో చేరబోతున్నారంటూ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. తెరాసలో చేరేందుకే ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ని పొగిడారని, మంత్రి పదవి ఇస్తే ఆయన తెరాసలో చేరిపోవడానికి సిద్దంగా ఉన్నారంటూ మీడియాలో ఊహాగానాలు వినిపించాయి.
అయితే కోమటిరెడ్డి తెరాసలో చేరే ఆలోచన తనకు లేదని ఎంత మొత్తుకొంటున్నా ఊహాగానాలు ఆగలేదు. అందుకే ఆయన మళ్ళీ నిన్న నల్గొండలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మరోమారు స్పష్టం చేసారు. “ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో త్రాగు,సాగునీటి సమస్యను ఏవిధంగా పరిష్కరించబోతున్నారో పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో చాలా చక్కగా వివరించారు. లిఫ్ట్ ఇరిగేషన్ విధానం ద్వారా సముద్రంలో వృధాగా పోతున్న నీటిని భువనగిరికి తరలిస్తామని కేసీఆర్ చెప్పారు. అందుకోసం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో ఏడు చోట్ల మోటార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదే సరయిన, ఆచరణ సాధ్యమయిన విధానం. అందుకే నేను ఆయనను అభినందించాను.”
“ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన్న ప్రభుత్వం చేసే ప్రతీ పనిని తప్పు పట్టనవసరం లేదు. మంచిపని చేసినప్పుడు మెచ్చుకోవడం, అవసరమయినపుడు నిర్మాణాత్మక సహకారం అందించాలి. అలాగే ప్రభుత్వ పొరపాట్లను, అవినీతిని చూపించాలి కూడా. ముఖ్యమంత్రి చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ నాకు నచ్చింది కనుకనే నేను మెచ్చుకొన్నాను. అయితే అంత మాత్రాన్న నేను తెరాసలో చేరిపోతున్నానని ప్రచారం చేయడం సరికాదు. తెలంగాణా సాధన కోసం నా మంత్రి పదవినే వదులుకొని ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసాను. కనుక నేను పదవులకి ఆశపడి పార్టీలు మార్చే వ్యక్తిని కాను. నేను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. నీటిపారుదల విషయంలో కేసీఆర్ కి మంచి అవగాహన ఉన్నప్పటికీ, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, దళిత కుటుంబాలకు మూడెకరాల భూని ఇవ్వడం వంటి హామీల అమలుపై ఏ మాత్రం అవగాహన, చిత్తశుద్ధిలేదు. ఒకవేళ ఆయన అందుకు ప్రయత్నించినా తన జీవిత కాలంలో ఆ హామీలను నేరవేర్చలేరని ఖచ్చితంగా చెప్పగలను,” అని పొగిడిన నోటితోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోమటిరెడ్డి వెంకట రెడ్డి విమర్శించారు. కనుక ఆయన ఇప్పట్లో తెరాసలో చేరకపోవచ్చును.