హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉన్నంతవరకే టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, ఆ తర్వాత 14 ముక్కలవటం ఖాయమని అన్నారు. కేసీఆర్ అనంతరం, టీఆర్ఎస్ కేటీఆర్, టీఆర్ఎస్ హరీష్‌రావు, టీఆర్ఎస్ కవిత, టీఆర్ఎస్ వినోద్ కుమార్…ఇలా 14 ముక్కలవుతుందని కోమటిరెడ్డి అన్నారు. జై తెలంగాణ అనొద్దన్న తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస యాదవ్‌లకు మంత్రిపదవులు దక్కాయని, ఉద్యమంలో కొడుకు శ్రీకాంతాచారిని పోగొట్టుకున్న శంకరమ్మకు ఏమీ లేకుండా పోయిందని తీవ్రంగా విమర్శించారు. నల్గొండలో రు.2 కోట్లతో నిర్మించిన ఆర్డీవో కార్యాలయాన్ని కోమటిరెడ్డి ఇవాళ ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఆయన పాలనకు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.