ఆయన కాంగ్రెస్ లో ఉన్నారా.. అంటే, ఉన్నారనే చెప్పుకోవచ్చు. మరో పార్టీకి మారే అవకాశాలు ఉన్నాయా.. అంటే, అవుననీ చెప్పుకోవచ్చు! ఆయనేనండీ.. తెలంగాణ కాంగ్రెస్ ప్రముఖ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అటో ఇటో ఎటో తెలియని జంక్షన్ లో ఆయన పొలిటికల్ కెరీర్ ఉంది. ఇలాంటి సంధి కాలంలో వీలైతే వ్యూహాత్మకంగా ఉండాలి. లేదంటే, మౌనాన్ని ఆశ్రయించి భవిష్యత్తును కాలానికే వదిలెయ్యాలి. అంతేగానీ.. అపరిపక్వంగా ఏవైనా పనులు చేస్తే.. ఇదిగో ఇలానే బూమ్ ర్యాంగ్ అవుతుంది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నల్గొండలో జరిగిన దాడి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారుతోంది. ఆ దాడికి కారణం.. కోమటిరెడ్డి స్వయంకృతం అని చాలామంది విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నాయని ముందు నుంచీ తెలిసినా.. ఆయనే మొండికేసి సభకు బయలుదేరడంతో అసలు చిక్కు వచ్చి పడిందని అంటున్నారు. ఇంతకీ.. ఆ సభ ఎవరు ఏర్పాటు చేసిందయ్యా అంటే తెరాస సర్కారు! బత్తాయి మార్కెట్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి హరీష్ రావు సభ ఏర్పాటు చేశారు. నిజానికి, ఇదే మార్కెట్ కోసం గతంలో.. అంటే, ఉమ్మడి ఆంధ్రాకి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఈయనా కొన్ని ప్రయత్నాలు చేశారు. పనులు ప్రారంభం అయినట్టే అయి, ఆగిపోయాయి. కానీ, ఆ తరువాత కిరణ్ సర్కారు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తరువాత, రాష్ట్ర విభజన.. ఎన్నికలు వరుసగా జరిగిపోవడంతో కోమటిరెడ్డి ప్రయత్నం నాడు అలా ఆగిపోయింది. ఇప్పుడు మంత్రి హరీష్ రావు చొరవతో పనులు ముందుకు సాగాయి.
ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేని కూడా ఈ కార్యక్రమానికి పిలవాలి. దాంతో కోమటిరెడ్డిని కూడా ఆహ్వానించారు. అయితే, ఇక్కడి నుంచే అసలు ప్రచారం మొదలైంది. హరీష్ సభకు కోమటిరెడ్డి పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నారని! ఎందుకంటే, ఎలాగూ కాంగ్రెస్ లో కాస్తోకూస్తో అసంతృప్తితో ఉన్నారు కోమటిరెడ్డి. భాజపా పెద్దలు టచ్ లో ఉన్నారంటూ కథనాలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఈ సభ సక్సెస్ ద్వారా తెరాసకు ఏవో పాజిటివ్ సంకేతాలిచ్చే వ్యూహంతో ఆయన ఉన్నారంటూ ప్రచారం జరిగిపోయింది. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలీ… కోమటిరెడ్డి సభకు వెళ్లకూడదు కదా! దాంతో ఇలాంటి ఊహాగానాలకు చెక్ పడిపోతోంది.
కానీ, ఈయన ఏమాత్రం తగ్గలేదు. కొంతమంది కార్యకర్తలతో హ్యాపీగా ర్యాలీతో బయలుదేరారు. తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభకు వస్తారన్నది అందరూ ఊహించిందే. ఇలాంటి పరిస్థితుల మధ్య ఏ చిన్న గలాటా జరిగినా పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఉంటుందనేది కోమటిరెడ్డికి తెలియందా చెప్పండీ! కానీ, ఆయన అలా ఆలోచించలేదో.. ఇంకేదో ఆలోచనలో వెళ్లిపోయారోగానీ.. సీన్ రివర్స్ అయిపోయింది. పోనీ అక్కడితో ఆగినా బాగుండు! తెరాసలో రౌడీలున్నారనీ, కేసీఆర్ పాపం పండిందనీ ఆరోపించారు. అయితే, క్షేత్రస్థాయిలో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ఏంటంటే.. ఇదంతా కోమటిరెడ్డి అపరిపక్వ ఆలోచనల అమలు వల్ల జరిగిన ఘటన అంటున్నారు! మరి, కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉంటానని కలలు కనే కోమటిరెడ్డి, ఈ పరిస్థితిని ముందుగా అంచనా వేయలేకపోయారా..?