కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతినే ఖరారు చేయాలని .. అలా అయితే తాను ప్రచారం చేస్తానని హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేసి మరీ టిక్కెట్ ఇప్పించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు విదేశాలకు వెళ్లిపోతున్నారు. మూడు రోజుల్లో ఆయన కుటుంబంతో సహా విదేశాలకు చెక్కేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే ఆయన తిరిగి రానున్నారు. అంటే మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడానికి కానీ.. తమ్ముడికి వ్యతిరేకంగా పని చేయడానికి ఆయన సిద్ధంగా లేరన్నమాట.
స్టార్ క్యాంపెయినర్ హోదాలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా ఆర్థికంగా ఖర్చుపెట్టగల సామర్థ్యం ఉన్న కృష్ణారెడ్డి అనే నేతకు రేవంత్ రెడ్డి టిక్కెట్ ఇవ్వాలనుకున్నారు. కానీ పాల్వాయి స్రవంతికి టిక్కెట్ ఇప్పించిన కోమటిరెడ్డి ఇప్పుడు చక్కగా జారుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయడమేనని అంటున్నారు.
మునుగోడు ఉపఎన్నికల తరవాత ఆయన కూడా బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు ఇప్పటికే ఉన్నాయి. కేటీఆర్ కూడా ఆయన పార్టీ మారుతారని ప్రకటించారు. రెండురోజుల తర్వాత ఈ అంశంపై ఓ ట్వీట్ చేసి తప్పుడు ప్రచారం అని విమర్శించారు. మొత్తంగా కోమటిరెడ్డి లాంటి నేతలు.. కాంగ్రెస్ వల్ల బాగుపడి.. చివరికి ..అదే కాంగ్రెస్ పార్టీని ఎలా దెబ్బకొట్టాలో చూసి మరీ అదే విధంగా దెబ్బకొడుతున్నారని పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.