తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఎంతమంది నాయకులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఈ జాబితాలో ఉన్నవారే. నిజానికి, అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ఆయన పీసీసీ బాధ్యతలు తనకు ఇవ్వాలంటూ హైకమాండ్ ని కోరుతున్నారు. తనకు పగ్గాలిస్తే పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చే వరకూ నిద్రపోనని ఆయన అంటుంటారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ… పీసీసీ అధ్యక్ష్య పదవి రేసులో ఉన్నానని మరోసారి ప్రకటించారు. హైకమాండ్ తనకే ఇవ్వాలనే సుముఖతతో ఉందని కోమటిరెడ్డి చెప్పడం విశేషం!
పీసీసీ పదవి కోసం తాను ఇప్పటికే ఢిల్లీలో ప్రముఖ నేతలందరినీ కలిశానన్నారు కోమటిరెడ్డి. ఒక సీనియర్ నాయకుడిగా తనకు అవకాశం ఇవ్వాలనీ, అందరినీ కలుపుకుని పనిచేస్తానని చెప్పానన్నారు. 32 ఏళ్లుగా ఒకే పార్టీలో ఉంటున్నానన్నారు. త్వరలో సోనియా గాంధీని కూడా కలవబోతున్నానని, పీసీసీ పదవి తనకే ఇవ్వాలంటూ ఆమెను కూడా స్వయంగా కోరతా అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యమనీ, త్వరలో గ్రామాల్లో పర్యటించాలని భావిస్తున్నా అని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పీసీసీ పదవి నాకే ఇస్తారని అనిపిస్తోందన్నారు! అదేదో ముఖ్యమంత్రి పదవి కాదు కదా, నాలుగేళ్లపాటు కష్టపడాలి నేను అన్నారు. నాకు మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి ఇయ్యకున్నా ఫర్వాలేదు, వాటిని ఎవరికైనా ఇచ్చుకోండి, పార్టీ పదవి మాత్రం ఇయ్యండి అన్నారు కోమటిరెడ్డి. ఈ దోపిడీ ప్రభుత్వాన్ని దింపాలంటే నాలుగేళ్లు కష్టపడాల్సి ఉంటుందనీ, దానికి సిద్ధంగా ఉన్నా అన్నారు.
పీసీసీ పదవి రేసులో రేవంత్ రెడ్డి ఉన్నారంటూ చాలా కథనాలు వినిపించాయి. కోమటిరెడ్డి పేరు కూడా ప్రముఖంగానే ఉంది. ఇంకా చెప్పాలంటే జగ్గారెడ్డితో సహా ఓ అరడజనకు పైగా నేతలు రేసులో ఉన్నామని ఎవరికి వారు ప్రకటనలు చేసుకుంటూనే ఉన్నారు. కోమటిరెడ్డి చెప్పినట్టుగానే ఆశావహులందరూ ఇప్పటికే ఢిల్లీకి చాలాసార్లు వెళ్లొచ్చినవారే. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక హైకమాండ్ కి తలనొప్పి వ్యవహారంగానే మారింది. పదవి వస్తుందో రాదో భరోసా లేకపోయినా సరే.. అధ్యక్ష హోదాలో రాష్ట్రంలో పర్యటిస్తా, పార్టీ కోసం పనిచేస్తా, అందర్నీ కలుపుకుని ముందుకు సాగుతా అంటూ కోమటిరెడ్డి ప్రకటనలు చేస్తుండటం హాస్యాస్పదంగా ఉంది.