కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. ఆ పార్టీ ఇజ్జత్ తీసేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి హైకమాండ్‌ను చాలా తక్కువగా అంచనా వేశారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి ఇక్కడ మునుగోడులో ఓటర్లకు సందేశం ఇస్తున్నట్లుగా మునుగోడులో కాంగ్రెస్ గెలవదు.. తాను ప్రచారం చేస్తే కొన్ని ఓట్లు వస్తాయి అవి కూడా రావడం తనకు ఇష్టం లేదన్నట్లు మాట్లాడి.. వ్యూహాత్మకంగా షూట్ చేయించుకుని మీడియాకు అందేలా చేసిన కోమటిరెడ్డి ఇప్పుడు ఆ వీడియోను ఫేక్ అంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తనకు పంపిన షోకాజ్ నోటీసులపై ఆయన స్పందించారు. వివరణ ఇచ్చారు.
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో .. ఫేక్ అని.. అందులో ఉన్నది తాను కాదని చెప్పుకొచ్చారు. పార్టీలో తాను చాలా సీనియర్ నేతనని చెప్పుకొచ్చారు వెంకట్‌రెడ్డి. ఎన్ఐయూఐ విద్యార్థి విభాగం నుంచి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించారు. 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పని చేస్తున్నానని… తన సీనియార్టీకి తగిన ప్రాధాన్యత, గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వివరణ చూసి.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మరింతగా ఆశ్చర్యపోయారు. హైకమాండ్‌ను అంత తేలిగ్గా తీసుకుంటున్నారేమిటని అనుకుంటున్నారు.
నిజానికి అది ఫేక్ అయితే అప్పుడే కోమటిరెడ్డి ప్రకటించి ఉండేవారు. కానీ ఆయన మాట మాత్రంగా కూడా అది ఫేక్ అని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పలేదు. ఇప్పటికీ చెప్పలేదు. తనకు వచ్చిన షోకాజ్‌కు విరవణ ఇచ్చేలాగే అది ఫేక్ అని వాదిస్తున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణ దాటిన వెంటనే… కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి.