కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను మంత్రి అయ్యే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కోసం వదులుకున్నానని చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ రుణం తీర్చుకోవడానికే తాను కాంగ్రెస్‌ను వీడలేదన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడానకి కారణం టీఆర్ఎస్సేనని.. తాను ఆపార్టీలో చేరి ఉంటే ప్రాజెక్ట్ పూర్తి అయి ఉండేది.. తనకు మంత్రిపదవి వచ్చి ఉండేదన్నారు. తాను టీఆర్ఎస్లో చేరలేదన్న కక్షతోనే ప్రాజెక్ట్ పనులు చేయడం లేదని కోమటిరెడ్డి చెబుతున్నారు.
కోమటిరెడ్డి పార్టీ మార్పుపై తరచూ ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఓ సందర్భంలో బ్రదర్స్ ఇద్దరూ టీఆర్ఎస్ కండువా కప్పుకోవడం ఖాయమన్న ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఆగిపోయారు. దీనికి కారణం ఆ బ్రదర్స్ పెట్టిన షరతులు మాత్రమే కాదు.. ఆ జిల్లాలో టీఆర్ఎస్ నేతలతో ఎవరితోనూ పొసగని పరిస్థితి. ముఖ్యంగా టీఆర్ఎస్ పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి జగదీష్ రెడ్డితో ఆయనకుతీవ్రమైన వైరం ఉంది.
జగదీష్ రెడ్డి కోమటిరెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనను కాదని కేసీఆర్ కోమటిరెడ్డి బ్రదర్స్‌ను పార్టీలోకి తీసుకోలేకపోయారు. ఉద్యమ సమయం నుంచి వెంట ఉన్న జగదీష్ రెడ్డికే ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో వారు పార్టీలోకి వస్తే.. మొత్తం ఆధిపత్య పోరాటంతో ఇబ్బందిఎదురవుతుందున్న ఉద్దేశంతో కేసీఆర్ లైట్ తీసుకున్నారు. అయితే కోమటిరెడ్డి మాత్రం తాను టీఆర్ఎస్లోకి వెళ్తే మంత్రిపదవి వచ్చేదని చెప్పుకుంటున్నారు.