తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు బ్యాలెన్స్ చేసే కసరత్తును కాంగ్రెస్ హైకమాండ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏ పదవి లేకపోవడంతో ఆయనకు స్టార్ క్యాంపెయినర్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి పరిశీలన అనంతరం ఈ హోదా ఇస్తున్నట్లుగా ప్రకటించింది. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చినప్పటి నుండి కోమటిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఇటీవల ఆయన సర్దుకున్నారు. పార్టీ కి అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు.
ఇటీవల పార్టీ నేతలందరితో రాహుల్ తో జరిగిన సమావేశంలో తాను చాలా సీనియర్‌నని ఏ పదవి లేకపోవడం వల్ల బాధ్యతలు తీసుకోలేకపోతున్నానని వాపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో రాహుల్ గాంధీ స్టార్ క్యాంపెయినర్ హోదా ఇవ్వాలని సూచించినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రచార కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీ గౌడ్ ఉన్నారు. ఆయనకు అదనంగా కోమటిరెడ్డి ఉంటారు. నిజానికి స్టార్ క్యాంపెయినర్లను ఎన్నికల సమయంలోనే ప్రకటిస్తారు. ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ల జాబితా ప్రకటిస్తారు.
కానీ కోమటిరెడ్డికి ముందుగానే ఈ హోదా ఇచ్చారు. ఆయన తెలంగాణలో ఎక్కడైనా రాజకీయాలు చేయాడనికి అవకాశం చిక్కుతుంది. ఇప్పటి వరకూ ఇతరుల నియోజకవర్గాల్లో వేలు పెట్టడానికి అవకాశం అవకాశం లేదు. ఇప్పుడు తన హోదాతో ఆయన తెలంగాణ మొత్తం రాజకీయం చేయవచ్చు. రేవంత్‌తో పోటీగా అన్ని నియోజకవర్గాల్లో తిరేగే అవకాశం ఉంది.