ఏ పార్టీలో చేరాలన్నది ఎన్నికలకు నెల రోజుల ముందు డిసైడ్ చేసుకుంటాని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అంటే తాను కాంగ్రెస్లో లేనని చెప్పకనే చెబుతున్నారన్నమాట. మునుగోడు ఉపఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయలేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనూ పాల్గొనలేదు. రాహుల్ పాదయాత్ర తెలంగాణకు వచ్చిన సమయంలో … కోమటిరెడ్డి హైదరాబాద్లోనే ఉన్నారు. కానీ.. ఆయన పాల్గొనే ప్రయత్నం చేయలేదు.
మునుగోడు ఉపఎన్నికల సమయంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా కోమటిరెడ్డి పలు రకాల కామెంట్లు చేశారు. ఈ కారణంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి రెండు సార్లు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వాటికి ఆయన సమాధానం ఇచ్చారు. అవి తన మాటలు కాదని.. తన మాటల్ని మార్ఫింగ్ చేశారని చెప్పుకొచ్చారు. ఆ వివరణపై కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ కోమటిరెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ పదవిని కోరుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆ అవకాశాన్ని రేవంత్ రెడ్డికి ఇచ్చింది. అప్పటి నుండి కోమటిరెడ్డి అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరుతారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఆయన ఖండించలేదు. ఇప్పుడు నేరుగానే ఆయన ఎన్నికలకు నెల ముందు పార్టీ మారుతానని అంటున్నారు.