రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తాను సీఎంగా ప్రమాణం చేసి మేడిగడ్డ రిపేర్ చేస్తానన్న హరీష్ రావు వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. హరీశ్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలు కావటం ఖాయమన్నారు. హరీష్ వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
హరీష్ ముఖ్యమంత్రి కావాలనే ప్రణాళికతో ఉన్నారన్నారు. కేసీఆర్ను కాదనుకొని వస్తే అందుకు సపోర్ట్ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి ఆఫర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కవిత, హరీశ్, కేటీఆర్ల పేర్ల మీద విడిపోతుందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో నాలుగు పార్టీలు అవుతాయని జోస్యం చెప్పారు. హరీశ్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేదన్నారు. 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ చేశారు. కట్టె పట్టుకొని తిరుగుతున్న కేసీఆర్ పులి ఎట్లా అవుతారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే.. 86 కిలోలు ఉన్న తానేం కావాలని కోమటిరెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు. ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి నల్గొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నీటిని నింపటం సాధ్యమైతే హరీష్ కే బాధ్యతలు అప్పగిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే దీనికి సిద్దమంటూ హరీష్ ముందుకొచ్చారు. ఆ సమయంలో తనకు సీఎం పదవి ఇస్తే చేసి చూపిస్తానని చెప్పుకొచ్చారు.