హుజురాబాద్ ఫలితం తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా స్వరాలు పెరుగుతున్నాయి. ఇంకా గాంధీ భవన్ గడప తొక్కనని .. తన నియోజకవర్గం గురించి తప్ప ఇక దేని గురించి పట్టించుకోనని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు కొత్త సవాళ్లు చేస్తున్నారు. నేనేంటో చూపిస్తానంటూ ఆయన రంగంలోకి దిగారు. అది రేపట్నుంచే అంటూ హడావుడి చేయడం ప్రారంభించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సీఎల్పీలో కోమటిరెడ్డితో సమావేశమయ్యారు.
కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశాలకు రావాలని ఆయనకు వీహెచ్ ద్వారా సందేశం పంపారు. అయితే వీహెచ్ ఏం మాట్లాడారో లేకపోతే.. తన అవసరం కాంగ్రెస్ పార్టీకి తెలిసిందని అనుకున్నారో కానీ కోమటిరెడ్డి ఆ విషయం గురించి చెప్పకుండా ఇక తానేంటో చూపిస్తానంటూ బయలుదేరారు. ఎల్లారెడ్డి – కామారెడ్డి నుంచే ఉద్యమం ప్రారంభిస్తానని ప్రకటించారు. తనది కాంగ్రెస్ అని.. తన దేవత సోనియా అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆయన చేసే ఉద్యమం టీఆర్ఎస్కు వ్యతిరేకంగానా లేక రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానా అన్నదానిపై స్పష్టత లేదు.
ఆయన ఏం చేయాలనుకున్నా.. పార్టీ అనుమతి తీసుకోవాలి.. తీసుకుంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే అసంతృప్తి బలంగా వినిపించడానికి మాత్రం ఆయనకు ఓ గొప్ప అవకాశం లభించినట్లయింది. ఓ వైపు సోనియాను పొగుడుతూ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే సరిపోతుందని ఆయన అనుకుంటున్నట్లుగా ఉందని రేవంత్ వర్గీయులు ఆక్షేపిస్తున్నారు.