పదవులు వద్దనే నాయకులు ఎవరైనా రాజకీయాల్లో ఉంటారా..? మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో పదవులు వద్దనేవారు ఎంతమంది ఉన్నారు! ఓ అరడజను ముఖ్యమంత్రి అభ్యర్థులు, ఓ ముగ్గురు పీసీసీ అధ్యక్ష పదవి ఆశావహులు ఇప్పటికే ఉన్నారనే బహిరంగ రహస్యం. ఎప్పటికిప్పుడు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూనే ఉంటారు. అయితే, ఇలాంటి ఆశావహులందరి మధ్యా సమన్వయం కోసం హైకమాండ్ చెయ్యాల్సిన కృషి చేస్తూనే ఉంది. ఇక, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయానికొస్తే… తనకు పదవులేవీ వద్దని ఇప్పుడు అంటున్నారు!
నల్గొండలో జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ… తనకు మంత్రి పదవి వద్దూ, ముఖ్యమంత్రి పదవీ వద్దన్నారు. కేసీఆర్ ను ఓడించడం ఒక్కటే లక్ష్యమన్నారు! రాష్ట్రం కేవలం ఓ నలుగురి చేతిలో నగిలిపోతోందనీ, వారి కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడమే తమ లక్ష్యమన్నారు. నల్గొండ పార్లమెంటు స్థానంలో వచ్చే ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని ఓడించడంతోపాటు, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తా అన్నారు.
తనకు పదవి వద్దు అని కోమటిరెడ్డి చెబుతూ ఉండటం కాస్త కొత్తగా ఉంది. అదీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన కూర్చుని చెప్పడం మరీ కొత్తగా ఉంది! ఎందుకంటే, తనకే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ ఒక దశలో కోమటిరెడ్డి ఓపెన్ గానే డిమాండ్ చేస్తుండేవారు. రాష్ట్రంలో పార్టీకి మంచి రోజులు రావాలంటే… పార్టీని ఉత్తమ్ నాయకత్వం నుంచి తప్పించాలంటూ ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు చేసిన గ్రూపులో ఈయనా ఉన్నారు కదా! ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో తాను ఉన్నానని ప్రకటించుకున్నవారిలో కోమటిరెడ్డి కూడా ఒకరు. తమ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ, ఉద్దేశపూర్వకంగా తమను తొక్కేస్తున్నారంటూ రాహుల్ కి కోమటిరెడ్డి కూడా ఫిర్యాదు అప్పట్లో చేశారు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న కోమటిరెడ్డి తనకు పదవులే వద్దంటూ ఇప్పుడు వ్యాఖ్యానించడం విశేషమే..! ఆ మధ్య అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురైన దగ్గర నుంచీ ఉత్తమ్ తో కూడా బాగానే ఆయనకి సయోధ్య కుదిరింది. ఓరకంగా ఇది పార్టీకి మంచి పరిణామమే అని చెప్పుకోవాలి. అయితే, ఈ ఐకమత్యం ఎన్నికల వరకూ కొనసాగాల్సిన అవసరం ఉంది.