తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్ రాగానే సీనియర్లు మరోసారి గళం వినిపించారు. గాంధీభవన్‌కు వచ్చి కలవాలని కొత్త ఇంచార్జ్ మాణిక్ రావా ధాకరే పిలిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్‌కు రానే రానని తేల్చి చెప్పారు. బయట హోటల్లో ఆయన అల్పాహార సమయంలో కలిశారు. మాట్లాడారు. తర్వాత మీడియాతో ఆయన హైకమాండ్ ను అవమానపరిచే వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆయనకు హైకమాండ్ రెండు సార్లు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అవి ఎప్పుడో చెత్తబుట్టలోకి చేరాయని కోమటిరెడ్డి సెటైర్ వేశారు.
ఇక గాంధీ భవన్‌లోనే ధాక్రేను కలిసిన ఇతర సీనియర్లు రేవంత్ రెడ్డి టార్గెట్ గానే తమ వాయిస్ వినిపించినట్లుగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డిని అసలు పాదయాత్ర చేయకుండా ఆపాలని అందరూ కోరినట్లుగా చెబుతున్నారు. గతంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని..ఆయనను దూకుడుగా ఉండకుండా ఆపలేకపోయారని వాదిస్తూ.. గత ఇంచార్జిపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసి ఆయన వైదొలిగేలాచేశారు. ఇప్పుడు కొత్త ఇంచార్జిపైనా అదే ప్రయోగం చేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అంత సులువుగా ఉండవని మొదటి పర్యటనలోనే మాణిక్ రావుకు అర్థమైపోయింది. అందుకే ఈ సారి ఇరవయ్యో తేదీ తర్వాత మరో మూడు రోజుల పాటు .. తెలంగాణలో పర్యటిస్తానని అందరితో మాట్లాడతానని చెప్పారు. అయితే రేవంత్ పాదయాత్ర 26 నుంచి ప్రారంభం అవుతుందని మాణిక్‌రావు ధాకరే ప్రెస్ మీట్లో ప్రకటించారు. తర్వాత వచ్చినప్పుడు అందరితో మాట్లాడతానని చెప్పుకొచ్చారు.