సోదరుడు పార్టీ మారితే ఆయన ఇష్టం వచ్చిన పార్టీలోకి వెళ్తున్నారని సమర్ధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. రేవంత్ రెడ్డి మాత్రం తనకు క్షమాపణ చెప్పాల్సిందేనంటున్నారు. సోదరుడిపై పల్లెత్తు మాట అనకుండా… తన పార్టీ చీప్పై మాత్రం చెలరేగిపోయారు. ఢిల్లీలో మీడియాతోమాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్‌పై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే “మీరు” బ్రాందీషాపుల్లో సీసాలు ఏరుకోవడానికి పనికొచ్చేవారు కాదని రేవంత్ రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. అయితే ఇక్కడ మీరు అంటే.. రాజగోపాల్ రెడ్డితో పాటు తాను కూడా వస్తానని కోమటిరెడ్డి తనకు తానే అనేసుకుని రేవంత్ రెడ్డిపై మండి పడ్డారు.
రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే ఆయనను విమర్శించాలి కానీ.. రేవంత్ కుటుంబాన్ని విమర్శించారని మండిపడ్డారు. మీరు అని అని రేవంత్ రెడ్డి అన్నారని..అలా అనడం వల్ల కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లయిందని కోమటిరెడ్డి చెబుతున్నారు. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు అనే పదాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. నిజానికి మీరు అనేది గౌరవ వాచకం. ఇద్దర్ని కలిపి అనకపోయినా.. ఒక్కర్ని కూడా మీరు అని గౌరవంగా సంబోధిస్తారు. కానీ రేవంత్‌ను టార్గెట్ చేయాలనుకున్న కోమటిరెడ్డి అదే అంశాన్ని పట్టుకుని విమర్శలు ప్రారంభించారు. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తాను ఎవరికీ ఫిర్యాదు చేయబోనని.. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ప్రకటించారు.
తనను అనవసరంగా రెచ్చగొట్టవద్దని.. తాను ఒక్క మాట కూడా పడనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెబితే అది చేస్తానని…కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తాము కష్టపడి కాంట్రాక్టులు చేసి సంపాదించుకున్నామని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంతో తనకు సంబంధం లేదన్నట్లుగా వెంకటరెడ్డి స్పందించారు. . కానీ ఆయన “మీరు” అనే చిన్న పదాన్ని పట్టుకుని చాలా అర్థం తీసుకుని రేవంత్ రెడ్డిపై విరుచుకుపడటం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్‌నే టార్గెట్ చేసి పార్టీకి రాజీనామా చేశారు. కోమటిరెడ్డి కూడా అదేబాటలో వెళ్తారన్న దానికి తాజా విమర్శలు సంకేతంలా కనిపిస్తున్నాయి.