తెలంగాణ కాంగ్రెస్ ను ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆ పార్టీ హైకమాండ్ అసలు ఏమీ చేయలేకపోయింది. పైగా ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉంటానంటే చాలనుకునేలా వ్యవహరిస్తోంది. ఆయన కూడా బీజేపీతో సంప్రదింపులు పూర్తి చేసుకుని ఇక తమ్ముడిలా లాంగ్ జంప్ కు రెడీ అయ్యారని అందరికీ తెలిసినా చివరి క్షణంలో ట్విస్టులు ఇస్తున్నారు. తాజా ఆయన గాంధీ భవన్ లో ప్రత్యక్షమయ్యారు. రేవంత్ రెడ్డితో గుసగుసలాడారు.
టీ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత ఆయన తాను ఇక గాంధీ భవన్ మెట్లెక్కనని సవాల్ చేశారు. అ ప్రకారం అప్పటి నుండి గాంధీ భవన్ కు రావడం లేదు. అయితే జాగా గాంధీ భవన్ మెట్లెక్కనని తాను ఎప్పుడూ అనలేదని రేవంత్ రెడ్డి కవర్ చేసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జ్ గా మాణిక్ రావు ధాక్రే నియమితులైన తర్వాత తొలి సారి హైదరాబాద్ వచ్చి రెండు రోజుల పాటు సీనియర్ నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఆహ్వానించారు. కానీ ఆయన తాను గాంధీ భవన్ కు రానని..బయట కలుస్తానని సమాచారం ఇచ్చారు.దానికి తగ్గట్లుగా తర్వాతి రోజు.. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాణిక్ రావు ధాక్రేతో సమావేశం అయ్యారు. కానీ రెండో సారి మాణిక్ రావు థాక్రే.. తెలంగాణ పర్యటనకు వచ్చే సరికి ఆయన గాంధీ భవన్ లో ప్రత్యక్షమయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తాను గాంధీ భవన్‌కు వచ్చానని కోమటిరెడ్డి చెప్పుకున్నారు. నిజానికి ఇటీవల నియమించిన ఏ కాంగ్రెస్ కమిటీలోనూ ఆయనకు చోటు దక్కలేదు. కానీ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చానని చెప్పుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి దూరంగా లేనని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చెప్పుకొచ్చారు. కానీ ఇటీవల తిరుమల పర్యటనలో తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని… ఎన్నికలకు రెండు నెలల ముందు ఏ పార్టీలో చేరుతానో చెబుతానని ప్రకటించారు. మాణిక్ రావు థాక్రేనే తనను రావాలని ఫోన్ చేశారని కోమటిరెడ్డి చెబుతున్నారు. మొత్తంగా కోమటిరెడ్డి ఏదో ప్లాన్ వేశారని..అది కాంగ్రెస్ కు పాజిటివా.. నెగెటివా అనేది తేలాల్సి ఉందంటున్నారు.