కోమటిరెడ్డి ఆస్ట్రేలియా వెళ్లిపోయి కాంగ్రెస్ గురించి నెగెటివ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ గెలిచే ప్రశ్నే లేదని బండేశారు. ఆయనకు ఏఐసిసి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. తర్వాత ఆయన ఏఐసిసి ఎన్నికల్లో ఓటు కూడా వేయలేదు సరి కదా.. రాహుల్ గాంధీ పాదయాత్ర.. తెలంగాణలో జరుగుతున్నా పట్టించుకోలేదు. మునుగోడు ఉపఎన్నిక అయిపోయిన తర్వాత ఆయన ఆస్ట్రేలియా నుంచి తిరిగి వస్తారేమో అని అనుకున్నారు. కానీ ఆయన పోలింగ్‌కు ముందే వచ్చేశారు.
దీంతో మునుగోడులో తమ్ముడు పరిస్థితి కాస్త కష్టంగా ఉండటం.. ఆర్థిక వనరులను .. టీఆర్ఎస్ సర్కార్ గట్టిగా బిగించేయడంతో.. కాపాడేందుకు.. తానే స్వయంగా రంగంలోకి దిగినట్లుగా కోమటిరెడ్డి వర్గీయులు చెబుతున్నారు. పోల్ మేనేజ్ మెంట్లో నిపుణుడు అయిన వెంకటరెడ్డి.. నల్లగొండ నుంచే మునుగోడులో బీజేపీ వ్యవహారాలను రెండు రోజుల పాటు చూస్తారని అంటున్నారు. ఆ నియోజకవర్గం మొత్తం కాంగ్రెస్ నేతలు ఆయనకు తెలుసు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం కన్నా… బీజేపీకి ఓటు వేయడమే మంచిదని ఆయన చక్రం తిప్పే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
మరో వైపు రాహుల్ గాంధీ జోడో యాత్ర హైదరాబాద్‌లోనే ఉంది. కానీ ఆయన పాల్గొనే ఉద్దేశంలో లేరు., ఇప్పుడు ఆయన వస్తానన్నా.. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించకపోవచ్చని చెబుతున్నారు. మరో వైపు ఆయనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఆ సమాధానం ఇవ్వకపోయినా… ఇచ్చినా ఆయనపై చర్యలు తీసుకుంటారని.. గట్టి నమ్మకంతో కాంగ్రెస్ క్యాడర్ ఉంది.