తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు.. తమ అంతర్గత ప్రత్యర్థుల్ని ఇరికించడానికి బీఆర్ఎస్ పార్టీ వాదనతో గొంతు కలిపేందుకు వెనుకాడరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయంలో చాలా మందు ఉంటారు. తాజాగా అమెరిగా పర్యటనలో ఉచిత విద్యుత్ మూడు గంటలు చాలు అని రేవంత్ రెడ్డి అన్నారంటూ..బీఆర్ఎస్ ఓ వీడియోను సర్క్యూలేట్ చేయడం ప్రారంభించారు. తర్వాత ఆ పార్టీ నేతలు కూడా వచ్చి ..రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ వద్దన్నారని ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేశారు.
ఏదో ముందుగానే మాట్లాడుకున్నట్లుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని మీడియా సంస్థలను పిలుచుకుని రేవంత్ రెడ్డి నిజంగానే అలా మాట్లాడారన్నట్లుగా.. ఆయన టీడీపీ నుంచి వచ్చారని.. ఉచిత విద్యుత్ గురించి తెలియదన్నట్లుగా స్టేట్ మెంట్లు ఇచ్చేశారు. రేవంత్ రెడ్డి ఎవరని.. తాను చెబుతున్నా.. రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని డైలాగులు కూడా చెప్పారు. అయితే ఇతర కాంగ్రెస్ నేతలు అధికారిక ప్రెస్ మీట్లు పెట్టి.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాట్లాడింది.. విద్యుత్ ఒప్పందాల గురించని.. రైతులకు ఎనిమిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని అన్నారని అంటున్నారు. వీరు ఇచ్చే కౌంటర్ బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేసినట్లుగానే ఉంటుంది. కానీ.. కోమటిరెడ్డి మాత్రం రేవంత్ ఏదోతప్పు మాట్లాడేశారన్నట్లుగా డిసైడ్ చేయడమే ఆశ్చర్యకరంగా మారింది.
రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన మాట్లాడిన వీడియోను ట్విస్ట్ చేసి.. కొన్ని మీడియాల్లో మాత్రమే ప్రసారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు. ఇలాంటి వాటికి కాంగ్రెస్ నేతలకు అంతర్గత సహకారం లభిస్తూండటమే.. ఆ పార్టీలో పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదన్నందుకు సాక్ష్యంగా మారిందన్న వాదన వినిపిస్తోంది.