తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి సోదరుల వ్యవహారం కలకలం రేపుతోంది. ఎప్పుడూ ఒక్క మాట మీద ఉండే అన్నదమ్ములిద్దరూ… ఎన్నికల కమిటీల విషయంలో.. తేడాగా స్పందించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి… సంతృప్తి వ్యక్తం చేస్తే.. రాజగోపాల్ రెడ్డి.. మాత్రం అందర్నీ బ్రోకర్లనేశారు. కుంతియాను శని అని తేల్చేశారు. క్రమ శిక్షణ ఉల్లంఘించారని.. పీసీసీ షోకాజ్ నోటీసులిస్తే… కార్యకర్తల అభిప్రాయాలే చెప్పానంటూ.. మరికొన్ని తిట్లు తిట్టారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తూంటే.. వారు పార్టీ నుంచి గెంటి వేయించుకునే పరిస్థితి కావాలనే తెచ్చుకుంటున్నారనే అనుమానాలు కాంగ్రెస్ ముఖ్యుల్లో వ్యక్తమవుతున్నాయి. మేనిఫెస్టో కమిటీ భేటీకి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాకపోవడం.. ఈ అనుమానాల్ని మరింత బల పరుస్తోంది. తమంతట తాముగా.. పార్టీకి రాజీనామా చేస్తే.. ఎఫెక్ట్ రాదని.. పార్టీ నుంచి తొలగిస్తే.. సానుభూతి ఉంటుందన్న అంచనాతో వారు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో తమ నాయకత్వం కార్యకర్తలు కోరుకుంటున్నారని.. రాజగోపాల్ రెడ్డి.. తనంతట తానుగా ప్రెస్మీట్లో చెప్పేశారు. మిగతా నేతలంతా.. తమ ముందు ఎందుకు కొరగాని వాళ్లన్నట్లు మాట్లాడేశారు. నిఖార్సైన కాంగ్రెస్ వాదులం తమ సోదరులే తప్ప..ఇంకెవరూ కాదన్నట్లు రాజగోపాల్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. ఉత్తమ్, రేవంత్ రెడ్డిలపై వీరిద్దరూ అసంతృప్తితో రగిలిపోతున్న విషయం మాత్రం స్పష్టంగా తెలిసిపోతోంది. అందుకే.. కాంగ్రెస్లో ఉన్నా.. కాంగ్రెస్ గెలిచినా.. తమకు వచ్చేదేమీ ఉండదన్న భావన వీరిలో పెరిగిపోతోందంటున్నారు. మునుగోడు నుంచి పోటీ చేయాలని.. రాజగోపాల్ రెడ్డి తాపత్రయ పడుతున్నారు. కానీ ఇంకా మూడేళ్లు ఎమ్మెల్సీ పదవి కాలం ఉన్నందున .. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్ ఇవ్వదు. అందుకే బ్రదర్స్ ఇద్దరూ.. ఇతర పార్టీల్లో చూసుకుంటున్నారన్న ప్రచారం నల్లగొండ జిల్లాలో జోరుగా సాగుతోంది.
డిప్యూటీ చైర్మన్గా ఉన్న కోమటిరెడ్డి హాజరు కాకపోయినా.. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ మత్రం తన పని చురుగ్గానే ప్రారంభించారు. పీపుల్స్ మేనిఫెస్టో తెస్తామని ప్రకటించారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు అడిగారు. వివిధ వర్గాల ఆశలు తెలుసుకోవడానికి సబ్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.
15 రోజుల్లో ఈ కమిటీ అన్ని అంశాల పై అధ్యయనం చేసి మేనిఫెస్టో అంశాలను క్రోడీకరించేలా ప్లాన్ చేసింది మేనిఫెస్టో కమిటీ. రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు.. కొద్ది రోజుల క్రితం.. ఉత్తమ్ ప్రకటించిన హామీలన్నింటినీ.. మ్యానిఫెస్టోలో చేర్చే అవకాశం కనిపిస్తోంది.