రాజకీయాల్లో రెండు పడవలపై ప్రయాణం చేయాలంటే.. ఎంతో నేర్పు ఉండాలి. ఓ పార్టీలో ఉంటూ.. మరో పార్టీతో బహిరంగంగా కాకుండా లోపాయికారీ సంబంధాలు నిర్వహించాలి. అలా కాకుండా.. ఉన్న పార్టీని విమర్శిస్తూ.. పక్క పార్టీని పొగుడుతూ… మళ్లీ తాను పార్టీ మారట్లేదని చెబుతూంటే.. ఆయన ఎవరికీ అక్కర్లేని రాజకీయ నాయకుడు అయిపోతాడు. ప్రస్తుతం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి అంతే ఉంది. ఆయన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు హాజరై… ఏ పార్టీలో ఉన్నాడో అర్థం కాకుండా ప్రవర్తించారు. మీడియా ఎదుట అలాగే పొంతన లేకుండా మాట్లాడారు.
గురువారం అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎల్పీ సమావేశానికి హాజరు కాలేదు. కానీ నేరుగా సభలోకి వచ్చి కాంగ్రెస్ సభ్యులతోనే కూర్చున్నారు. కానీ సభలో కాంగ్రెస్ సభ్యులు నల్లకండువాలతో నిరసన వ్యక్తం చేస్తున్నా… తనకేమీ పట్టనట్లు కూర్చుండిపోయారు. అలాగే… సభలో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేస్తున్న సందర్బంలో కూడా వారితో పాటు వాకౌట్ చేయలేదు. అలాగే కూర్చున్నారు. అయితే.. కాసేపటికే.. స్పీకర్ను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిశారు. వారితో పాటు స్పీకర్ వద్దకు వెళ్లారు. మళ్ళీ అంతలోనే మీడియా పాయింట్ లో మాత్రం కాంగ్రెస్ సభ్యులతో విభేదించారు. కలిసి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. తమతో కలిసి రావాలని శ్రీధర్ బాబు అడిగినా .. రానని చెప్పేశారు.
కాంగ్రెస్ సభ్యులు మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత ఒంటరిగా మీడియాతో మాట్లాడిన ఆయన.. పరస్పర అతకని సమాధానాలు చెప్పారు. కొద్ది రోజుల క్రితం.. బీజేపీలో చేరుడు ఖాయమని ఢిల్లీలో ప్రకటించుకున్న రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు మాత్రం మాట మార్చారు. తాను బీజేపీలో చేరతానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. మళ్ళీ అంతలోనే రాష్ట్రంలో బీజేపీనే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమని తేల్చేశారు. తాను పార్టీ మారలేదని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అ్నారు. సీఎల్పీ మీటింగ్ కు ఎందుకు హజరుకాలేదన్న మీడియా ప్రశ్నలకు.. సీఎల్పీ లేదు కదా అంటు ఎదురు ప్రశ్నలు వేశారు. కోమటిరెడ్డి తన రాజకీయ విధానంతో ఏ పార్టీకి కాకుండా పోతున్నారన్న అభిప్రాయం మాత్రం అసెంబ్లీలో ఏర్పడింది.