రైతుబంధు పథకం కింద ప్రభుత్వం చేస్తున్న సాయం కొంత ఆలస్యమౌతున్న సంగతి తెలిసిందే. కౌలు రైతుల్ని మొదట్నుంచీ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ మధ్య కొత్తగా పాస్ బుక్ లు వచ్చిన రైతులు అప్లై చేసుకున్నా… లబ్ధిదారులుగా వారిని చేర్చడం లేదంటున్న విమర్శలూ ఉన్నాయి. రైతుబంధు పథకంపై అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మాట్లాడారు. 70 శాతం భూ యజమానులు తమ భూముల్ని కౌలు రైతులకు ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఖర్చుపెడుతున్న వేల కోట్ల రూపాయలు పొలాల్లో కష్టపడి పనిచేసే నిజమైన రైతులకు అందడం లేదని విమర్శించారు.
తనకు రైతుబంధు పథకం కింద రూ. 3 లక్షలు వచ్చాయనీ, తనలాంటివాళ్లకు ప్రభుత్వం సొమ్ము ఇవ్వడం అవసరమా అని రాజగోపాల్ ప్రశ్నించారు. తనలాంటివాళ్లలు లక్షమంది ఉన్నారనీ, ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్నవారికి ప్రభుత్వం డబ్బులిస్తోందన్నారు. ప్రభుత్వ బంధు పథకం పెట్టిందే నిజమైన పేదలకు సాయం చేయడం కోసమనీ, ఇలా డబ్బున్నవాళ్లకు కూడా లక్షలకు లక్షలకు ఇవ్వడం వల్ల పేద రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. తనకు వచ్చిన రూ. 3 లక్షల్నీ తన గ్రామంలో పేద రైతులకు పంచిపెట్టాననీ, తనలా ఎంతమంది చేస్తున్నారని ప్రశ్నించారు? రైతుబంధు అమలుపై ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
రాజగోపాల్ లేవనెత్తింది మంచి పాయింటే. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న రైతుల్లో చాలామంది కౌలుకే తమ భూముల్ని ఇచ్చేసి ఉంటారు. అంటే, పెద్ద సంఖ్యలో కౌలు రైతులు క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటారు, వారికి ప్రభుత్వ సాయం అందడం లేదు. నిజానికి, ఈ పథకం ప్రవేశపెట్టిన దగ్గర్నుంచీ ఈ అంశం చర్చనీయంగానే ఉంది. అయితే, గతంలో రైతుబంధు చెక్కులు ఇచ్చినప్పుడు మూడు ఎకరాలకు మించి ఉన్న రైతులకు పేమెంట్లు వాయిదావేశారు. అది తాత్కాలికమే. రాజగోపాల్ చెప్పినట్టు ఆర్థికంగా బాగా ఉండి, వారి భూముల్ని కౌలుకి ఇచ్చేసిన రైతులను ప్రభుత్వం గుర్తించాలి. వారికి అందించే సాయాన్ని క్షేత్రస్థాయిలో ఉన్న రైతులకు అందేలా చెయ్యాలి. కానీ, ఈ దిశగా ప్రయత్నం ఇంతవరకూ జరగనేలేదు.