ఒకసారి దెబ్బతింటే ఎవరైనా జాగ్రత్త పడతారు.వన్స్ బిటన్ ట్వైస్ షై అంటారందుకే. సీనియర్ పాత్రికేయుడు మిత్రుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఈ ఏడాది ఫిబ్రవరిలో మాజీ సిఎస్ రమాకాంతరెడ్డిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన జగన్పై కేసులలో అసలు పసలేదని వ్యాఖ్యానించారు. అది పెద్ద వివాదం అయింది. కేసులను ప్రభావితం చేసే ప్రయత్నమని విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి ఆయనే గాకసాక్షి ఛానల్ కూడా చాలా జాగ్రత్త తీసుకుంటున్నది. ఇప్పుడు 2జి కేసు తీర్పు వచ్చాక సహజంగానే జగన్ కేసుతో పోల్చిచూడటం జరుగుతుంది. నేను దానిపై ఒక విశ్లేషణ ఇచ్చాను కూడా. అయితే శుక్రవారం ఉదయం చర్చలో ఈ విషయం వచ్చినప్పుడు వైసీపీ నాయకుడు అమర్నాథ్ రెడ్డి తీర్పు ఒకసారి వచ్చాక అదే అంతిమమని తాము మాట్లాడబోమని అన్నారు. సిబిఐ తీరుపై మాట్లాడవలసిందిగా కోరినా దాటేశారు. ఇంతలో ఒక కాలర్ జగన్ కూడా ఇలాగే బయిటకు వస్తారని అన్నారు. వెంటనే కొమ్మినేని జోక్యం చేసుకుని జగన్ కేసుపై మాట్లాడొద్దు లేనిపోని సమస్యలని ఆపడానికి ప్రయత్నించారు. సామాన్య ప్రజలూ కార్యకర్తలూ తమ ఆశాభావం వెలిబుచ్చితే తప్పు లేదని స్టూడియోలో వున్న నేనూ, బిజెపి ప్రతినిధి రఘునందనరావు చెప్పడానికి ప్రయత్నించాం. పైగా రమాకాంతరెడ్డి ఆ కేసులో సాక్షిగా వున్నారు గనక ఆయన సంగతి వేరు. మామూలు వారు వేరు.ఏమైతేనేం జాగ్రత్త మంచిదేకదా…