రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించినప్పుడు.. అదీ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి మరణించినప్పుడు… గతంలో ఎప్పుడూ విపక్షాలు కానీ.. వాటి మౌత్ పీసుల్లాంటి మీడియా కానీ.. రాద్దాంతం చేసే ప్రయత్నం చేయలేదు. ఆ మృతిని అడ్డం పెట్టుకుని.. తన రాజకీయ ప్రత్యర్థిని టార్గెట్ చేసే ప్రయత్నాలు జరగలేదు. ఒక వేళ జరిగి ఉన్నా.. అవి జర్నలిజం పరిమితుల్లోనే ఉండేవి. కానీ.. ప్రతీ దానికి చంద్రబాబునే కారణంగా చూపించాలని తాపత్రయపడిపోయే… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. ఆ పార్టీ పత్రిక సాక్షి మాత్రం .. ఏ మూలో మిగిలి ఉన్న జర్నలిజం విలువల్ని కూడా… రోడ్డు ప్రమాదంలో పడి మరణించేలా చేసేసింది. దశాబ్దాల అనుభవం ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు అనే జర్నలిస్టు …చంద్రబాబుపై అమిత విద్వేషం చూపే.. అతి సాధారణ వైసీపీ కార్యకర్తలా రాసిన కథనాన్ని ప్రముఖంగా ప్రచురించి … తమకెలాంటి విలువలు.. వలువలు లేవని నిరూపించేసుకున్నారు.
హరికృష్ణ మృతి తో తమకు గొప్ప అవకాశం దొరికినట్లు సాక్షి పత్రిక ఎడిటోరియల్ టీమ్… చాలా ఆవేశ పడిదింది. హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న విషయం కన్నా.. ఆయన హరికృష్ణను .. రాజకీయంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్లలేదు కాబట్టే.. తప్పంతా చంద్రబాబుదే అన్నట్లుగా రాసుకొచ్చారు. హరికృష్ణ రాజకీయ జీవితంలో జరిగిన ఘటనలను… కూడా.. అన్నీ చంద్రబాబు వ్యూహం ప్రకారమే చేశారని కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పుకొచ్చి.. శవరాజకీయాలు చేయడానికి .. తాము ఎలాంటి ప్రమాణాలు పాటించబోమని నిరూపించేసుకున్నారు. నిలువెత్తు మనిషిని కోల్పోయి బాధల్లో ఉన్న కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడానికి సాక్షి ఎడిటోరియల్ టీమ్ ఏ మాత్రం సిగ్గుపడలేదు.
రాజకీయల్లోని ఏ వ్యక్తి జీవితామూ పూలపాన్పు కాదు. ఎత్తుపల్లాలుంటాయి. ఒడిదుడుకులు ఉంటాయి. అంత మాత్రాన చనిపోయినప్పుడు.. వాటన్నింటినీ అడ్డం పెట్టుకుని తన రాజకీయ ప్రత్యర్థిపై బురదజల్లడానికి మరణాల్ని అవకాశాన్ని వాడుకుంటారా..? పత్రికా విలువలకు పాతరేసి.. ఆ కుటుంబంలో చిచ్చు రేగిన పర్వాలేదు.. తాము మాత్రం రాజకీయంగా లాభపడితే పర్వాలేదనుకుంటారా..?. రాజకీయంగా ఎన్ని విబేధాలైనా ఉండవచ్చు.. .ఎన్ని రకాలైన విమర్శలు చేయవచ్చు. అదంతా పార్టీ వేదిక మీద చేసుకుంటే.. దానికో విలువ ఉంటుంది. కానీ అదే జర్నలిజాన్ని అడ్డు పెట్టుకుని పత్రికలో చేస్తే… దానికేమీ విలువ ఉండదు. పైగా జర్నలిజం విలువను దిగజారుస్తుంది. ఇప్పుడు సాక్షి అలాగే వ్యవహరిస్తోంది. ఆ పత్రిక జర్నలిజం ప్రమాణాలు కూడా.. రోడ్డు ప్రమాదంలో ఘోరంగా మరణించినట్లుగానే అయిపోయింది.
సుభాష్