మీడియాను ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ప్రజలపక్షం ఉండాలి. అంటే, ప్రతిపక్ష పాత్ర పోషించాలి. సామాన్యుడి కోణం నుంచి స్పందించాలి. అంతేగానీ, వ్యక్తిగత రాగద్వేషాల ఆవహించుకుని స్పందిస్తే వాస్తవాలు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే..! ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుకు సంబంధించి ఓ చర్చ పాత్రికేయ వర్గాల్లో ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఆయన ఎంతోమందికి గురుతుల్యుడు, తెలుగు రాష్ట్ర రాజకీయాలపై సమగ్రమైన అవగాహన, పట్టు ఉన్న పాత్రికేయుడు. ఆయనది రాజీపడని మనస్తత్వం అనడంలోనూ సందేహం లేదు! అయితే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయాలన్నదే ప్రధాన అజెండా పెట్టుకున్నారనీ, ఈ క్రమంలో వాస్తవాలను వదిలేస్తున్నారని అనుకుంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో ఆయన పాల్గొన్నారు. అయితే, పిలవని పేరంటానికి చంద్రబాబు వెళ్లిపోయారంటూ కొమ్మినేని సొంత బ్లాగులో రాశారు. అంతేకాదు, ఒక లాంజ్‌ను అద్దెకి తీసుకుని, చేతి చమురు వదలించుకుంటూ గొప్పలకు పోతున్నారనీ, దాదాపు రూ. 7 కోట్లు ఖర్చు చేసి ఎంట్రీ పాస్ కొనుకున్నారని కూడా చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు ఆధారంగా ఈ అభిప్రాయాన్ని వెల్లడించానని కూడా అన్నారు. కొమ్మినేని స్థాయి పాత్రికేయుడు చెబితే నిజమే అయి ఉంటుందని చాలామంది భావించడం సహజం. దాంతో చాలామంది సోషల్ మీడియాలో చంద్రబాబు తీరుపై విమర్శలు చేసారు . కొమ్మినేని వాఖ్య ఆధారంగా ఎన్నో కథనాలు వచ్చేశాయి కూడా!
అయితే, వాస్తవాలు మరోలా ఉన్నాయి! వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నుంచి చంద్రబాబుకు వచ్చిన ఆహ్వానాన్ని ఏపీ సర్కారు విడుదల చేసింది. ఏపీ సీఎంను సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు ఆ లేఖలో ఉంది. దీంతో మీడియా వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. చంద్రబాబును విమర్శించాలన్న ఏకైక ఉద్దేశంతో కొమ్మినేని కూడా పుకార్లు పుట్టిస్తున్నారా అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. గతంలో కొమ్మినేని ఉద్యోగం పోవడానికి పరోక్షంగా చంద్రబాబు నాయుడే కారణం అంటుంటారు. ఆ తరువాత, ప్రతిపక్ష నేత జగన్‌కు చెందిన సాక్షిలో ఆయన చేరారు. అక్కడి నుంచీ ప్రజల పక్షాన ఉండే కొమ్మినేని వాయిస్… పూర్తిగా ప్రతిపక్షం వైపునకు మారిపోయినట్టుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు! అలా మారినా ఫర్వాలేదుగానీ… కేవలం చంద్రబాబును విమర్శించాలన్న ఏకైక లక్ష్యంతో పుకార్లను ప్రోత్సహించడం ఆయన స్థాయికి సరితూగే పాత్రికేయమా అనేది కొమ్మినేని అభిమానుల ఆవేదన!