పొగడరా పొగడరా అంటే… మా అన్న దుర్యోధనుడు.. ఆయన తల్లి గాంధారీ .. దుర్యోధనుడి కారణంగా కౌరవ వంశం నాశనం అయినట్లుగా వైఎస్ జగన్ కారణం వైఎస్ రాజారెడ్డి గొప్ప వంశం అంతా సర్వనాశనం అయిపోతోంది అని శాపాలు పెడుతున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు. నెలకు మూడు, నాలుగు లక్షల వరకూ జగన్ రెడ్డి దగ్గర జీతం తీసుకుంటూ ఆయన ఎంత మేలు చేస్తున్నారో కానీ ఇలాంటి అజ్ఞానపు రాతలతో ఆయన పరువు మాత్రం తీస్తున్నారు.
ఆస్తుల పంపకంలో జగన్ రెడ్డి తప్పు చేస్తున్నారని చెబుతూ విజయమ్మ రాసిన బహిరంగ లేఖకు కౌంటర్ ఇచ్చేందుకు మొత్తం సాక్షి బలగాన్ని రంగంలోకి దింపారు జగన్. సీనియర్ కాబట్టి కొమ్మినేనిపై కూడా ఆర్టికల్ భారం వేశారు. ఆయన ఆలోచించి పురాణాలను ఎత్తుకొచ్చి దాన్ని జగన్ ఫ్యామిలీతో లింక్ పెట్టి విజయమ్మపై రాళ్లేద్దామనుకున్నారు. వేశారు కూడా. కానీ ఆ రాళ్లు విజయమ్మ మీద కాకుండా జగన్ మీద పడ్డాయి. విజయమ్మను గుడ్డి గాంధారిగానూ.. జగన్ ను దుర్యోధనుడిగానూ చూపించారు. అదే వ్యాసంలో స్టార్టింగ్లో దుర్యోధనుడి ఎంత ధూర్తుడో ఆయన వల్ల వంశం నాశనం అయిపోయిందని చెప్పారు. తర్వాత ఆ పోలికను అలా కొనసాగించారు.
ఏదో పదం బాగుందని వాడేసినట్లుగా… మహాభారతంతో వైఎస్ కుటుంబాన్ని లింక్ పెట్టాలని చూసిన ఓ అసహ్యమైన ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ తరంలో ఎవరికి అర్థమవుతుందిలే అనుకున్నారో.. లేకపోతే కొమ్మినేని రాసిందాన్ని తీసేసేంత ధైర్యం లేక కింది స్థాయి సిబ్బంది తెలిసి కూడా ఊరుకున్నారో కానీ అలా కొనసాగుతోంది. ఈ ఆర్టికల్ పై సాక్షిలోనే సీనియర్లు సెటైర్లు వేసుకుంటున్నారు. జగన్ రెడ్డికి ఇలాంటి వాళ్లే కరెక్ట్ అనుకుంటున్నారు.
తల్లిపై రాళ్లేసేందుకు చివరికి కొమ్మినేని లాంటి వాళ్లనూ ప్రయోగిస్తున్న జగన్ తాను చేస్తున్న తప్పేమిటో గ్రహించలేకపోతున్నారని నిఖార్సైన వైఎస్ కుటుంబ అభిమానులు ఫీలైపోతున్నారు.