సాక్షి టీవీలో ఉదయమే చర్చలు పెట్టి అందరూ నోరెళ్ల బెట్టే వాదనలు చేసే జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పుడు కష్టకాలంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దేవులపల్లి అమర్ లాంటి వాళ్లకు కూడా సలహాదారు పదవులు ఇచ్చి రూ. లక్షలు నెలకు ఇస్తున్నా కొమ్మినేనికి ఎలాంటి పదవి ప్రభుత్వం ఇవ్వకపోగా ఇప్పుడు సీబీఐ కేసుల్లో ఇరుక్కుపోయే పరిస్థితి కల్పించింది. న్యాయవ్యవస్థపై దూషణల కేసులో ఆయన సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్యూతో పాటు ఆయన తన కొమ్మినేని.ఇన్ఫో పేరుతో నిర్వహించే వెబ్సైట్లో రాసిన కథనాలపై సీబీఐ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.
దీంతో ఆయన స్క్రీన్‌పై కనిపించడం లేదు. అంతే కాదు తన వెబ్ సైట్‌ను కూడా పూర్తిగా మూసేశారు. అందులో వార్తలేమీ లేవు. మామూలు వార్తల్ని కూడా తీసేయడం చర్చనీయాంశమవుతోంది. సీబీఐ ఇటీవల న్యాయవ్యవస్థపై దూషణల కేసులో చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పుడు ఎవర్ని అరెస్ట్ చేస్తుందో స్పష్టత రావట్లేదు. ఏకంగా హైకోర్టు సీనియర్ లాయర్లను కూడా అరెస్ట్ చేయడంతో ఇప్పుడు ఎవర్నీ వదిలి పెట్టబోరన్న పరిస్థితి వచ్చింది. దీంతో కొమ్మినేని జాగ్రత్తల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఆయన తీరు ఉందన్న అభిప్రాయం ఇప్పటికే వినిపిస్తోంది. ఆరోగ్య సమస్యల వల్ల పక్కన మనిషి ఉండకపోతే బయటకు పోలేని పరిస్థితుల్లో ఇప్పుడు సీబీఐ ఆయనపై దృష్టి పెడితే జీవితంలో ఎప్పుడూ పడనన్ని కష్టాలు కొమ్మినేని పడే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ జాగ్రత్తలు ఎంత మేర ఆయనను కాపాడతాయో చూడాలి !