జస్టిస్ ఫర్ దిషా – ఉదంతం దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. సెలబ్రెటీలంతా దీని గురించే మాట్లాడుతున్నారు. సినిమావాళ్లు కూడా. హంతకుల్ని వెంటనే శిక్షించాలన్నది అందరి డిమాండ్. కోన వెంకట్ కూడా అదే చెబుతున్నాడు. హంతుకుల్ని ఉరి తీయాలని – వాటిని లైవ్లో చూపించాలని అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలంటే భయం ఏర్పడుతుందని సూచించాడు. స్వాతంత్య్రం వచ్చాక ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని, అయితే ఒక్క కేసులో కూడా నిందితులకు ఉరిశిక్ష పడలేదని, ఈసారి మాత్రం అలా కానివ్వొద్దని కోరుతున్నారు. ఆయన నిర్మాతగా తెరకెక్కిన `నిశ్శబ్దం` సినిమా వేడుకలో జస్టిస్ ఫర్ దిషా పై చర్చ జరిగింది. చిత్రబృందం అంతా.. దిషాకు నివాళులు అర్పించారు.
ఇలాంటి ఘటనలు జరక్కుండా ప్రభుత్వాలు జాగ్రత్తపడాలని, పోలీసులు కూడా తక్షణం స్పందించాలని కోరారు కోన. పోలీస్ స్టేషన్లకు వెళ్తే.. ‘ఆ ఏరియా మా పరిధిలోకి రాదు’ అనే మాట వినపడకుండా చూడాలని, అందుకు సంబంధించి చట్టాల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. ఈ ఉదంతంతో `నిశ్శబ్దం` ప్రెస్ మీట్ కాస్త… దిషాకు నివాళి సభలా మారిపోయింది.