హైదరాబాద్: విడుదలకు సిద్ధమైన తన చిత్రం ‘శంకరాభరణం’ కాపీయేనని రచయిత, నిర్మాత కోన వెంకట్ ఎట్టకేలకు ఒప్పుకున్నారు. ఐదేళ్ళక్రితం విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘ఫస్ గయే రే ఒబామా’ చూసి ఆ పాయింట్‌ను బేస్ చేసుకుని ఈ కథను అల్లానని నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్లో చెప్పారు. ‘ఫస్ గయే రే ఒబామా’ చిత్రాన్ని నాడు అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రెసిషన్ కథాంశంతో రూపొందించారు. రు.6 కోట్ల వ్యయంతో నిర్మించగా రు.19 కోట్లు గడించింది.
బీహార్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ సినిమా కొత్తగా ఉంటుందని కోన చెప్పారు. పవన్ కళ్యాణ్ టీజర్ విడుదల చేయటం వల్ల సినిమాకు మంచి క్రేజ్ వచ్చిందని అన్నారు. అంజలి తనపై అభిమానంతో తాను అడగగానే ఓ ముఖ్యమైన పాత్రలో నటించటానికి ఒప్పుకుందని చెప్పారు. నిఖిల్, నందిత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కోన సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కోన స్క్రీన్ ప్లే అందించిన ‘త్రిపుర’ చిత్రం ఆడియా విడుదలైన మరుసటిరోజే ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ‘శంకరాభరణం’ ఆడియా విడుదల కావటం విశేషం. మొత్తంమీద ఇండస్ట్రీలో కోన వేవ్ నడుస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ రైటర్‌గా ఉంటూనే నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా కూడా చక్రం తిప్పుతున్నారు. ఇటీవల విడుదలైన ‘బ్రూస్ లీ’ చిత్రంతోబాటు, నిర్మాణంలో ఉన్న బాలకృష్ణ చిత్రం ‘డిక్టేటర్’, విడుదల కాబోతున్న ‘అఖిల్’ వంటి పలు చిత్రాలకు కోన, గోపీ మోహన్ రచయితలన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌తో కూడా చిత్రం చేయబోతున్నట్లు చెబుతున్నారు.