ఢీ సినిమా నుంచి ఒకే ఫార్ములాతో వరుస హిట్స్ కొట్టాడు కోన. గీతాంజలి లాంటి సినిమాల విషయంలో అయితే ఘోస్ట్ డైరెక్టర్ని పెట్టేసి, అంతా తానే అయి సూపర్ హిట్స్ కొట్టాడు కోన వెంకట్. అలా అని ఆయన అనుకున్నాడు. సక్సెస్ సీక్రెట్స్ అన్నీ తనకు తెలిసిపోయాయని భ్రమించాడు. హీరోలు, డైరెక్టర్స్ అందరూ కూడా… జస్ట్ తను చెప్పినట్టుగా, తనకు నచ్చినట్టుగా సినిమా తీసేస్తే చాలు, ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఫ్లాపులే ఉండవని ఘాట్టిగా ఫీలయ్యాడు. కానీ అన్నీ తానై తీసిన త్రిపుర బాల్చీ తన్నేసింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీని మార్చేయబోతున్నానని… తన గురించి తానే డప్పేసుకుని, సర్వం తానై తెరకెక్కించిన శంకరాభరణం సినిమా నవ్వులపాలైంది. మామూలుగా అయితే సినిమా ఫ్లాప్ అయింది అని చెప్పాలి. కానీ పబ్లిసిటీ టైంలో కోన వెంకట్ చేసిన ఓవర్ యాక్షన్ దెబ్బకు ఇరిటేట్ అయిన మీడియా వాళ్ళు, ప్రేక్షకులు కూడా కోన వెంకట్ బీభత్సమైన క్రియేటివ్ ఆలోచనలతో ‘శంకరాభరణం’ ఆడేసుకున్నారు. ఆ తర్వాత నుంచీ కోన వెంకట్ అనే పేరు పోస్టర్ పైన వేయాలంటేనే తెలుగు ఇండస్ట్రీ జనాలు జడుసుకుంటున్నారు. ఆ పేరు ఉన్న సినిమాలకు వెళ్ళాలంటేనే… ప్రేక్షకులు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. అభినేత్రి సినిమా ఎలా ఉంది అనే విషయం కూడా తెలుసుకోకుండా……కోనవెంకట్ క్రియేటివిటీనా? వద్దులేరా బాబూ…అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అయితే అత్యంత ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే కోన వెంకట్ మాత్రం ఇంకా రెడీ, గీతాంజలి కాలం నాటి సక్సెస్ ‘మత్తు’లోనే ఉన్నట్టున్నాడు. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ కూడా తనతో పనిచేయాలని తహతహలాడుతున్నట్టుగా భ్రమిస్తున్నాడు. తనలో ఉన్న రచయిత హ్యాండ్ పడకపోతే తెలుగు ఇండస్ట్రీ ఏమైపోతుంది? అనే రేంజ్లో ఆలోచిస్తున్నట్టున్నాడు. బోలెడన్ని ఖళాఖండాలకు పనిచేస్తూ బిజీగా ఉన్నందునే డైరెక్టర్ని అవలేకపోతున్నానని ఆవేధన చెందుతున్నాడు. అట్టే మాట్టాడితే త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివలు దర్శకత్వం వైపు వెళ్ళిపోవడంతో ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి తాను తప్ప ఇంకో దిక్కు లేకుండా పోయిందని, ఉన్న ఒకే ఒక్క రైటర్ని తానేనన్న రేంజ్లో మాట్లాడేస్తున్నాడు.
ప్రేక్షకులను మాయ చేయడమే సినిమా అని చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే ఆ క్రమంలో చిన్నికృష్ణ, కోనవెంకట్ లాంటి రచయితలు, ఇంకా కొంతమంది హీరోలు, దర్శకులు కూడా… ఓ రెండు హిట్ సినిమాలు పడగానే ఇక తమంత తోపు లేడనుకుంటారు. సినిమా సక్సెస్ సీక్రెట్స్ అన్నీ తెలిసిపోయాయని అనుకుంటారు. తమ హ్యాండ్ పడితే చాలు…. ఆ సినిమా ‘బాహుబలి’ రేంజ్‌కి వెళ్ళిపోతుందన్న భ్రమల్లో ఉంటారు. ఇక ఆ తర్వాత నుంచీ పనిలో చూపించాల్సిన హీరోయిజాన్ని, గొప్పదనాన్ని యాటిట్యూడ్‌లో చూపిస్తూ ఉంటారు. దాంతో వాళ్ళతో కలిసి పనిచేస్తున్న తోటి వాళ్ళందరినీ బాధపడుతూ ఉంటారు. అలా ఇండస్ట్రీ జనాలకు మానసికంగా దూరమవుతారు. టాలెంట్ ఉన్నవాడెవ్వడూ అలాంటి వాళ్ళతో కలిసి పనిచేయడానికి ఇష్టపడడు. ఈ రోజుల్లో సినిమా ప్రేక్షకులెవ్వరూ కూడా కేవలం సినిమా కంటెంట్‌ని బట్టే సినిమాలకు వెళ్ళడం లేదు. వాళ్ళ ప్రవర్తన, మాటలు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ మధ్య భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఓ హీరో కొంతమంది సాఫ్ట్ వేర్ ఎంప్లాయిూస్తో గొడవపడ్డాడు. ఇప్పటికీ కూడా ఆ హీరో సినిమాను థియేటర్‌కి వెళ్ళి చూడకూడదని, అలాగే ఆయన సినిమాలకు నష్టం చేయాలని ఆలోచించే సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ ఎందరో? చాలా మంది ప్రేక్షకులు తమను చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తున్నారని, తమ బిహేవియర్ ప్రభావం సినిమాలపైన పడుతుందన్న విషయాన్ని ఇప్పుడిప్పుడే చాలా మంది సినిమా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. మంచితనాన్ని నటిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ చాలా మంది యువతరం టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ మాత్రం ఇగో, యాటిట్యూడ్ లాంటి వాటిని పక్కన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద… పే…ద్ద వాళ్ళు కూడా అలాంటి వాళ్ళ నుంచి నేర్చుకుంటే నలుగురిలో నవ్వుల పాలు కాకుండా ఉంటారు.