ఎన్నికల సమయంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ కు… సమర్థించేందుకు ఇతర పార్టీలపై తిట్లు లంకించుకున్న సినీ ప్రముఖులకు ఒక్కొక్కరిగా తాయిలాలు అందిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జగన్ కు మద్దతివ్వడం అంటే.. ఇతర పార్టీల నేతలను ఇష్టం వచ్చినట్లు తిట్టడమే అనుకునే రాజకీయం చేసిన సినీ కమెడియన్ ఫృధ్వీ.. తన రాజకీయం కారణంగా.. సినిమా అవకాశాలు కోల్పోయారు. అదే విషయాన్ని వైసీపీ హైకమండ్ కు తెలిసేలా చేసుకుని ఎస్వీబీసీ చానల్ చైర్మన్ పదవి పొందారు. మిగతా నటులకు పదవులు లైన్లో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అందరికీ పదవులే కాదు.. కొంత మందికి ఇతర లాభాలు కూడా కల్పించబోతున్నారని.. తాజాగా కొన్ని పరిణామాలతో వెల్లడవుతోంది.
గత ఎన్నికలకు ముందు.. టీడీపీపై సామాజిక వర్గ కోణంలో విమర్శలు చేసి వైసీపీకి మద్దతు పలికిన… రచయిత కోన వెంకట్.. ఇప్పుడు తాను.. రూ. 500 కోట్లతో.. ఓ డిస్నీలాండ్ తరహా స్టూడియోను… నిర్మించబోతున్నట్లుగా ప్రకటించారు. అది కూడా.. ఆయన బంధువు కోన రఘుపతి ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల నియోజకవర్గంలోనట. ఆ నియోజకవర్గంలో సూర్యలంక బీచ్ ఉంది. పర్యాటకంగా కొంచెం పేరున్న ప్రాంతం అది. ఆ ప్రాంతంలో… రూ. 500 కోట్లతో.. స్టూడియో ఏర్పాటు చేస్తామని సర్వే కూడా ప్రారంభించారు. నిజానికి ప్రైవేటు వ్యక్తులు ఇలా సర్వేలు చేయడం నిషిద్ధం. కానీ.. అధికారుల అనుమతి తీసుకున్నామని… కోన చెబుతున్నారు.
ఓ అంతర్జాతీయ సంస్థ.. మరో రాష్ట్ర సంస్థ.. ప్రభుత్వ సంస్థ అంటూ.. కోన వెంకట్.. చాలా పేర్లు చెబుతున్నప్పటికీ.. భూములు కేటాయించాల్సింది మాత్రం ప్రభుత్వమే. ఏదో హామీ రాకపోతే.. నేరుగా ఆ ప్రాంతానికి వెళ్లి కోన వెంకట్ భూముల సర్వే చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. దగ్గరి బంధువే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి… పరిస్థితి మరింత అనుకూలం. మరి ప్రభుత్వం తరపున కోన వెంకట్ కు…ఎంత మేర ప్రయోజనం లభిస్తుందో.. ఆయన అంత పెద్ద మొత్తం పెట్టి… స్టూడియో నిర్మిస్తారో లేదో… వేచి చూడాల్సిందే.