తెలుగుదేశం, జనసేన కూటమిలో ఇప్పటి వరకూ ఉన్న అంచనాలకు భిన్నంగా కొన్ని సీట్లలో మార్పు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారని అనుకున్నారు. ఆయన అక్కడ కార్యాచరణ కూడా ప్రారంభించారు. కానీ సీట్ల సర్దుబాటు ప్రారంభమైన తర్వాత ఆయన అనూహ్యంగా స్లో అయ్యారు. కొణతాల రామకృష్ణకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇష్టం లేదు. అక్కడ టీడీపీ నేత పీలా గోవింద్ పొత్తు లేకపోయినా గెలుస్తారన్న అంచనాలు ఉన్నాయి. ఆయనకే సీటు ఇచ్చి తనకు ఎంపీగా అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు.
ఈ అంశంపై పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయి. అనకాపల్లి నుంచి కొణతాలకే చాన్సిచ్చి అసెంబ్లీకి పీలా గోవింద్ సత్యనారాయణ పేరును పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అచ్చన్నాయుడుతో కలిసి అనకాపల్లి టీడీపీ నేత పీలా గోవింద్ చంద్రబాబును కలిశారు. పవన్ తోనూ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుతో బుధవారం ఉదయం జరిపిన చర్చల్లో సీట్లు.. అభ్యర్థుల అంశంపై అనకాపల్లిపైనా చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు.
బీజేపీతో పొత్తుల విషయంపై ఢిల్లీలో కీలక చర్చలు జరుగుతున్నాయి. వీటిపై రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అవి పూర్తయ్యాక.. మిగిలిన అన్ని స్థానాలకూ అభ్యర్థుల్ని టీడీపీ, జనసేన ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే రాజమండ్రి రూరల్ వివాదాన్ని కూడా పరిష్కరించుకున్నారు. కందుల దుర్గేష్ నిడదవోలులో పోటీ చేసేందుకు అంగీకరించారు. అక్కడ టీడీపీ నేతలకు చంద్రబాబు సర్ది చెబుతున్నారు.