రాజకీయాలలో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. దీనిని నిజం చేస్తూ దశాబ్ధాల వైరాన్ని పక్కన పెట్టి అనకాపల్లి జనసేన అభ్యర్ధి , మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మరో మాజీమంత్రి, తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లారు. ఇద్దరూ చర్చలు జరుపుకున్నారు. దాడి వీరభద్రరావు ఇటీవల వరకూ వైసీపీ ఉండి.. మళ్లీ టీడీపీలో చేరారు. దాడి తెలుగుదేశంలో కొణతాల కాంగ్రెస్లో చాలా కాలం ప్రత్యర్ధులుగానే ఉన్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేసుకొన్నారు. ఒక దశలో ఇద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ మాటలు, పలకరింపులు లేకుండానే కాలం గడచిపోయింది.
2014 ఎన్నికల్లో దాడి తనయుడు రత్నాకర్ విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేయగా, కొణతాల సోదరుడు రఘునాధ్ అనకాపల్లి నుంచి పోటీ చేశారు. ఆ తరువాత వీరభద్రరావు అనకాపల్లి టికెట్ ఆశించి తెలుగుదేశంలోకి వెళ్లగా, కొణతాల జనసేనలో చేరారు. పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించడంతో రాజకీయ విబేధాలను పక్కనపెట్టి దాడి వీరభద్రరావు ఇంటికి కొణతాల శుక్రవారం ఉదయం వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన మద్దతు కోరారు.
దాడి వీరభద్రరావు సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు రామకృష్ణ గెలుపునకు సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రకటించారు. దాడి వీరభద్రరావుతో కాలేజీ నుండి అనుబంధం ఉందని కొణతాల రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. దాడి అధ్యాపకుడిగా ఉన్నప్పుడు ఏఎంఎ ఎల్ కాలేజీలో తాను చదువుకోవడం జరిగిందన్నారు. రాజకీయంగా విభేదించాల్సిన పరిస్థితి నెలకొందని, తిరిగి మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం ఏర్పడిందని చెప్పారు..చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వీరి కలయిక అనకాపల్లి జిల్లా రాజకీయాలతో పాటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఆసక్తికర పరిణామంగా మారింది.