వైకాపా మాజీ నేత కొణతాల రామకృష్ణ ఉత్తరాంధ్ర వేర్పాటు ఉద్యమానికి సన్నాహాలు చేస్తున్నట్లున్నారు. ఆయన ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వెనకబాటుతనం, అవి ఎదుర్కొంటున్న సమస్యల గురించి తన లేఖలో పేర్కొని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించకపోయినట్లయితే, పరిస్థితులు చెయ్యి దాటిపోయిన తరువాత ఎవరూ ఏమీ చేయలేరని మృదువుగా హెచ్చరించారు. అంటే లేఖలో వ్రాసిన డిమాండ్లను నెరవేర్చకుంటే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభం చేస్తానని హెచ్చరిస్తున్నట్లే ఉంది. ఆయన వైకాపా నుంచి బయటకి వచ్చి రెండేళ్ళవుతోంది. ఇప్పుడు ఈవిధంగా అందరికీ లేఖలు వ్రాయడం గమనిస్తే ఆయన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టే ఉద్దేశ్యంతోనే ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదని అనుమానించవలసి వస్తోంది. ఆయన లేఖలో వ్రాసిన కోర్కెల జాబితా కూడా అదే సూచిస్తోంది. అవేమిటంటే:
1. ఉత్తరాంధ్రా అభివృద్ధికి రూ.15,000 కోట్లు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి మంజూరు చేయాలి.
2. ఉత్తరాంధ్ర అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ఒక చట్టబద్ధమైన కౌన్సిల్ ని ఏర్పాటు చేయాలి.
3. స్థానికులకు విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి.
4. ఉత్తరాంధ్రాలో పెండింగులో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలి.
5. వాటిపై ఒడిష ప్రభుత్వం లేవనెత్తుతున్న అభ్యంతఃరాలను తక్షణమే పరిష్కరించాలి.
6. గోదావరి జలాల్లో ఉత్తరాంధ్రాకి ప్రత్యేక వాటా కేటాయించాలి.
7. విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ఉత్తరాంధ్రాలో ట్రైబల్ యూనివర్సిటీ, ఇతర ఉన్నత విద్యాసమస్తలను ఏర్పాటు చేయాలి.
8. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి.
9. బాక్సైట్ త్రావ్వకాలతో సహా ఉత్తరాంధ్రాలో అన్ని రకాల మైనింగ్ లైసెన్సులను రద్దు చేయాలి.
10. అరుకు డిక్లరేషన్ న్ని అమలుచేయాలి.
11. ఉత్తరాంధ్రా జిల్లాలలో కాలుష్య నివారణకు ఒక కార్యాచరణ పధకం రూపొందించి, దానిని దశలవారిగా అమలుచేయాలి.
రాష్ట్రానికి ప్రధమ పౌరుడైన మీరు ఈ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. వీటి కోసం మీరు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలను గట్టిగా అడగవలసిందిగా అభ్యర్ధిస్తున్నాను. రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు అమలవలేదు. ఆ హామీని కూడా అమలు చేయవలసిందిగా కేంద్రంపై ఒత్తిడి తేవలసిందిగా ఈ లేఖ ద్వారా మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాను,” అని రామకృష్ణ గవర్నర్ నరసింహన్ న్ని కోరారు.